వైద్య సిబ్బందిపై దాడి చేస్తే ఇక జైలుకే : ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం

వైద్య సిబ్బందిపై దాడి చేస్తే ఇక జైలుకే : ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం

Updated On : June 19, 2021 / 4:36 PM IST

వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. డాక్టర్లపై జరుగుతున్న దాడులతో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌తో ఇకపై వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే జైలుకే వెళ్లాల్సి ఉంటుంది. ఏడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు 5 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

కరోనా వైరస్ రక్కసి జడలువిప్పి నాట్యం చేస్తుంటే ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తోన్న సిబ్బంది రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. వైద్యులపై దాడులను నిరోధించేందుకు కేంద్ర మంత్రివర్గం కొత్త ఆర్డినెన్స్‌ తెచ్చింది. 1897 నాటి ఎపిడెమిక్‌ డిసీజెస్‌ చట్టంలో మార్పులు చేసి తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ ఆర్డినెన్స్‌ అమల్లోకి రానుంది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఈ ఆర్డినెన్స్‌ అమల్లో ఉండనుంది.

వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. వైద్యులపై దాడి చేస్తే నాన్‌ బెయిలెబుల్‌ వారెంట్‌ కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. కేసు తీవ్రతను బట్టి దాడులకు పాల్పడిన వారికి 3 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. 50 వేల నుంచి 2 లక్ష వరకు జరిమాన విధిస్తారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిపై తీవ్రమైన దాడులకు పాల్పడితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది.

6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. క్లినిక్‌,  డాక్టర్లు, మెడికల్ స్టాఫ్‌ వాహనాలకు నష్టం కలిగిస్తే మార్కెట్‌ విలువ కన్నా రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వీటితో విధుల్లో ఉన్న సిబ్బందికి రూ.50 లక్షల వరకు జీవిత భీమా అందిస్తామని కేంద్రం తెలిపింది.  దేశంలో 735 కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్సను అందిస్తున్నారని కేంద్రం ప్రకటించింది.

24 వేల ఐసీయూలు, 2 లక్షల బెడ్‌లు, 12 వేల 190 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. 1.88 కోట్లు పీపీఐ కిట్స్‌కు ఆర్డర్‌ ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. 25 లక్షల ఎన్‌-95 మాస్కులు అందుబాటులో ఉండగా…మరో రెండున్నర కోట్లు మాస్కులకు కేంద్రం ఆర్డరిచ్చింది.  వైద్యులపై దాడులు జరిగితే ఫిర్యాదు చేయడానికి జిల్లా, రాష్ట్రాస్థాయిలో నోడల్‌ అధికారులను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.