‘వసంత పంచమి’: చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టిన రోజు

చదువుల తల్లి సరస్వతి దేవి అమ్మవారి పుట్టినరోజునే వసంత పంచమిగా జరుపుకుంటాం. మాఘ శుద్ధ పంచమి నాడు జరిగే ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సరస్వతీ దేవితో పాటు సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి.
వసంత పంచమి రోజున సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. అంతేకాదు..సకల సృష్టి కర్త అయిన బ్రహ్మదేవుడు కూడా వసంత పంచమి రోజున సరస్వతిదేవిని పూజిస్తాడు. సకల చరాచర సృష్టిని బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా సరస్వతీ దేవి ఉంది. బ్రహ్మదేవుడు తన జిహ్వ (నాలుక)పై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతోంది.
ఈరోజున సరస్వతీ అమ్మవారి జన్మదినం కాబట్టి వసంత పంచమి ఉత్సవాలను బాసరలో ఘనంగా నిర్వహిస్తారు. వసంతపంచమి ఉత్సవాలను ఈరోజు నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఈరోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారికి మంచి చదువులు వస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే వసంత పంచమి రోజున దేశ వ్యాప్తంగా ఉన్న సరస్వతి దేవాలయాలు అన్నీ భక్తులతో కిటకిట లాడుతూ ఉంటాయి. చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తారు.