Mother Language Day : మాతృభాషలను ముందు తరాలకు అందజేయడం మనందరి బాధ్యత

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.  తరతరాలుగా పెద్దలు మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారని... మాతృభాష మన అస్తిత్వాన్ని త

Mother Language Day : మాతృభాషలను ముందు తరాలకు అందజేయడం మనందరి బాధ్యత

International Mother Language Day

Updated On : February 21, 2022 / 12:21 PM IST

Mother Language Day :  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.  తరతరాలుగా పెద్దలు మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారని… మాతృభాష మన అస్తిత్వాన్ని తెలియజేయడమే గాక, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు.

అందుకే అమ్మభాషలో మాట్లాడేందుకు గర్వించాలి… సోదర భాషలను గౌరవించాలని ఆయన కోరారు. వందలాది భాషల సహజీవనంతో కూడిన భాషా వైవిధ్యం భారతీయుల సొంతం అని… మన సృజనాత్మక ఆలోచనలు, భావ వ్యక్తీకరణకు భాషే కీలకం అని వెంకయ్యనాయుడు చెప్పారు.

మాతృభాషల్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం, ముందు తరాలకు అందజేయడం మనందరి బాధ్యత. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని పిలుపునిస్తున్నానని తన ట్విట్టర్ సందేశంలో పేర్కోన్నారు.

ప్రతి ఏటా ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు.

ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.

మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది.

అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మన మాతృభాషను రక్షించుకోవాలి.