Kingfisher Penthouse: నేను జోక్‌గా అన్నాను, వాళ్లు సీరియస్ గా తీసుకున్నారు.. బెంగళూరులోని కింగ్‌ఫిషర్ పెంట్‌హౌస్ నిర్మాణంపై విజయ్ మాల్యా కామెంట్స్ వైరల్..
ప్రత్యేకత ఏమిటంటే ఇది మాల్యా బాల్యం గడిపిన ఇల్లు. తాను పెరిగిన, తన తండ్రి నివసించిన బంగ్లా.

Kingfisher Penthouse: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ యజమాని, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా నాలుగు గంటల నిడివి గల పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తాను ఎదుర్కొన్న ప్రతి ఆరోపణను ప్రస్తావించారు. RCB ఫ్రాంచైజీ కోసం తన ఆశయాల గురించి పంచుకున్నారు. అంతేకాదు బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్ పైన ఉన్న ప్రసిద్ధ పెంట్ హౌస్ గురించి కూడా ఆయన మాట్లాడారు.
కింగ్‌ఫిషర్ టవర్స్ పైభాగంలో ఉన్న ఇల్లు(పాత బంగ్లా) తన చిన్ననాటి ఇల్లు అని మాల్యా పంచుకున్నారు. అతి తన తండ్రికి చెందిన 100ఏళ్ల పాత బిల్డింగ్ అని తెలిపారు. తాను ఆ ఇంట్లో పెరిగానని, తన తండ్రి ఆ ఇంట్లోనే నివసించే వారని ఆయన అన్నారు. మొదట్లో ఆ ఆలోచన కేవలం జోక్ మాత్రమే అని చెప్పారు.
ఇర్ఫాన్ రజాక్ నేతృత్వంలోని ప్రెస్టీజ్ గ్రూప్ ఆ భూమిని విలాసవంతమైన నివాస భవనంగా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు, తాను సరదాగా తన కుటుంబానికి చెందిన పాత బంగ్లాను కొత్త భవనం పైభాగంలో ఉంచగలిగితేనే తాను అంగీకరిస్తానని చెప్పారట. తాను జోక్ చేసినా.. వారు మాత్రం నిజంగానే అలా చేశారట. కొత టవర్స్ కట్టి దానిపై పాత బంగ్లాను ఉంచారట. తాను ఏదో సరదాగా అన్నప్పటికీ.. వారు నిజం చేసి చూపించారని మాల్యా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆ ఆస్తి కబ్బన్ పార్క్ వైపుగా ఉంటుంది. బెంగళూరు బిజినెస్ డిస్ట్రిక్ట్ మధ్యలో ఉంది. ప్రత్యేకత ఏమిటంటే ఇది మాల్యా బాల్యం గడిపిన ఇల్లు. తాను పెరిగిన, తన తండ్రి నివసించిన బంగ్లా. ఒకప్పుడు కింగ్ ఫిషర్ టవర్స్ నిర్మించిన భూమిలోనే ఉందని ఆయన వివరించారు.
UBL వివాదం కారణంగా ఇప్పుడా ఆస్తి అసంపూర్ణంగా ఉంది. ఒకప్పుడు విజయ్ మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL) చెల్లించని అప్పుల కారణంగా కోర్టు కేసుల్లో ఉంది. మాల్యా రూ. 9,000 కోట్లకు పైగా రుణాలను ఎగవేశారు. వీటిలో ఎక్కువ భాగం విఫలమైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో ముడిపడి ఉన్నాయి. దర్యాప్తుల మధ్య అతను 2016లో భారతదేశం విడిచి వెళ్ళారు.
కింగ్‌ఫిషర్ టవర్స్ మాల్యా పెంట్‌హౌస్‌కు మాత్రమే కాకుండా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, జెరోధా నిఖిల్ కామత్ వంటి ఇతర ప్రసిద్ధ వ్యక్తులు అక్కడ నివసిస్తున్నందున కూడా ప్రసిద్ధి చెందింది. కబ్బన్ పార్క్, చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఉండటంతో బెంగళూరులో ఒక ప్రత్యేకమైన భవనంగా నిలిచింది.
View this post on Instagram