ఉదయాన్నే యాడ్‌లో ఎయిర్ ఇండియా విమానాన్ని ఇలా చూపించారు.. కాసేపటికే అచ్చం అలాగే విమాన ప్రమాదం.. ఫొటోలు వైరల్..
ఆ ప్రకటనలో కార్టూన్ శైలిలో.. ఓ భవనం నుంచి బయలుదేరుతున్న ఎయిర్ ఇండియా విమానం కూడా కనిపించింది.

అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.
అదే రోజు ఉదయం గుజరాత్‌లోని మిడ్ డే దినపత్రిక ఫస్ట్ పేజీలో “కిడ్జానియా” ఫాదర్స్ డే కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన ఇచ్చింది. 4 నుంచి 16 ఏళ్ల మధ్య పిల్లల కోసం ఈ ప్రకటనను “కిడ్జానియా” ఇచ్చింది. కిడ్జానియా అనేది 4 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన ఒక ఇండోర్ మినీ సిటీ.
ఈ ప్రదేశంలో పిల్లలు పైలట్‌లు, డాక్టర్లు, చెఫ్‌లు, ఇంజినీర్‌లు వంటి వృత్తులను అనుకరించే అవకాశాన్ని ఫాదర్స్ డే సందర్భంగా “కిడ్జానియా”లో కల్పించారు. అంటే, పిల్లలు నేరుగా ఆ వేషాలు వేసి, ఆ పని ఎలా జరుగుతుందో ప్రయోగాత్మకంగా నేర్చుకునే వీలు ఉంటుంది.

Ahmedabad plane crash
ఆ ప్రకటనలో కార్టూన్ శైలిలో.. ఓ భవనం నుంచి బయలుదేరుతున్న ఎయిర్ ఇండియా విమానం కూడా కనిపించింది. అదే రోజు జరిగిన విమాన ప్రమాదంలో విమానం అహ్మదాబాద్ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది. “కిడ్జానియా” తమ ప్రకటన ఇచ్చిన చిత్రంలాగే ఎయిర్ ఇండియా విమానం భవనానికి ఢీ కొట్టి అందులోనే నిలిచిపోయింది.
ప్రకటన కోసం ఇచ్చిన చిత్రం, నిజమైన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన తర్వాత కనపడ్డ ఫొటోలు ఒకేలా ఉండడంతో ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇది “సింప్సన్ ప్రిడిక్షన్”లా ఉందని నెటిజన్లు అంటున్నారు. “సింప్సన్ ప్రిడిక్షన్” అంటే యానిమేటెడ్ టీవీ షో. ప్రపంచంలో జరిగే సంఘటనలను వాస్తవానికి జరగడానికి ముందే అంచనా వేస్తూ ఆసక్తి కలిగిచేంలా ఈ యానిమేటెడ్ టీవీ షో ఉంటుంది. దీంతో ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ఈ యాడ్ ఇచ్చారా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
దీంతో ఆ యాడ్ కంపెనీ దీనిపై స్పందిస్తూ.. ఇది ముందే ప్లాన్ చేసిన యాడ్ అని, దీనికి ప్రమాదం తాలూకు సంబంధం లేదని తెలిపింది. ఇది కిడ్జానియా-ఎయిర్ ఇండియా భాగస్వామ్యంలో గత సంవత్సరం ప్రారంభించిన విద్యా కార్యక్రమానికి చెందిన లోగో అని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కిడ్జానియా కేంద్రాల్లో ఇదే స్టైల్‌లో యాడ్ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతానికి ఈ యాడ్‌ను కిడ్జానియా వాడడం లేదు.