కరోనా నుంచి ఎంతో మందిని రక్షించిన ఆ తహశీల్దార్ ఇక లేరు

కరోనా ఎందరి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. వైరస్ నుంచి అరికట్టడానికి అహర్నిశలు శ్రమిస్తున్న వారు సైతం బలవుతున్నారు. కోయంబేడ్ మార్కెట్ నుంచి గ్రామాల్లోకి వచ్చిన కూలీలను గుర్తించి…ఎంతో మందిని క్వారంటైన్లకు, కరోనా వార్డులకు తరలించిన విరుదాచలం తహసీల్దార్ ఇక లేరు.ఆయన చనిపోవడంతో చిదంబరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కోయంబేడ్ లో కరోనా వైరస్ అధిక ప్రభావం చూపింది. విల్లుపురం, తిరువణ్ణామలై, కడలూరు, కళ్లకురిచ్చి జిల్లాల్లో అమాంతంగా ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కోయంబేడ్ మార్కెట్ లో కూలీలు అధికంగా పని చేస్తున్నారు. కానీ ఎవరికీ తెలియకుండా స్వగ్రామాలకు వెళ్లిన కూలీలను గుర్తించే పనిని విరుదాచలం తహసీల్దార్ కవియరసు (48) ప్రత్యేక టీం రంగంలోకి దిగింది.
వీరి నుంచి ఎంతో మందికి వైరస్ విస్తరించే అవకాశం ఉండడంతో అహర్నిశలు పనిచేసింది ఈ టీం. రెండు నెలలుగా ఎంతో మందిని గుర్తించింది. కడలూరు జిల్లా పరిధిలో కూడా పర్యటించింది. జాగ్రత్తలు తీసుకుంటేనే…గుర్తించిన వారిని క్వారంటైన్ లోకి తరలించారు.
నిరంతర సేవలో ముందుకు సాగుతున్న కవియరసుకు 2020, జులై 10వ తేదీన కరోనా సోకినట్లు తేలింది. ఆయనతో తిరిగిన వారందరూ స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. చిదంబరం ఆసుపత్రిలో కవియరసు చికిత్స పొందారు. కానీ ఆయన పరిస్థితి విషమిస్తూ వచ్చింది. 2020, 19వ తేదీ ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారు.
ఆయన చనిపోయారన్న విషయం తెలుసుకున్న తోటి ఉద్యోగులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఎందరినో రక్షించి..చివరకు వైరస్ బారిన పడి చనిపోవడం రెవెన్యూ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కవియరసు సేవలను కొనియాడుతున్నారు.