డ్రగ్స్ కేసు…వివేక్ ఒబెరాయ్ ఇంట్లో పోలీసుల తనిఖీ

Vivek Oberoi’s Home Searched ముంబైలోని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో ఇవాళ(అక్టోబర్-15,2020)బెంగళూరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ కేసులో భాగంగా పరారీలో ఉన్న వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య అల్వా…ముంబైలోని వివేక్ ఇంట్లో దాక్కున్నాడన్న సమచారం అందడంతో బెంగళూరు పోలీసులు ఇవాళ వివేక్ ఇంట్లో తనిఖీ చేశారు. తమకు అందిన సమాచారం ఆధారంగా కోర్టు వారెంట్ తో క్రైం బ్రాంచ్ టీమ్ వివేక్ ఇంటికి వెళ్లినట్లు బెంగళూరు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు.
కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడైన ఆదిత్య అల్వా శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. శాండిల్ వుడ్ గా పిలువబడే కన్నడ సినీ పరిశ్రమలోని నటులకు,గాయకులకు డ్రగ్స్ సరఫరా కేసులో పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించిన వెంటనే ఆదిత్య అల్వా పరారీ అయ్యాడు. అప్పటి నుంచి ఆదిత్య కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. ఆదిత్య తల్లికి చెందిన బెంగళూరులోని హెబ్బాల్ లేక్ దగ్గర ఉన్న ఐదు ఎకరాల స్థలంలో కూడా గత నెలలో పోలీసులు సోదాలు చేయగా..అక్కడ నిర్వహించిన పార్టీల్లో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
కాగా, బాలీవుడ్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన వెంటనే కన్నడ సినీ పరిశ్రమలో కూడా డ్రగ్స్ వినియోగం గురించి వార్తలు వినిపించాయి. శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు రాగిణి ద్వివేది,సంజనా సహా 15మంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేవ్ పార్టీల నిర్వాహకులు వీరేన్ ఖన్నా,రియల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్ థాన్సే పేరు కూడా ఇందులో ఉన్నాయి.