శశికళకు కరోనా.. జ్వరం, శ్వాసకోశ సమస్యలు

శశికళకు కరోనా.. జ్వరం, శ్వాసకోశ సమస్యలు

Updated On : January 22, 2021 / 7:25 AM IST

VK Sasikala : అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో ఉన్నారు. శశికళకు జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొవడంతో సెంట్రల్‌ జైలు నుంచి భద్రత మధ్య నగరంలోని బౌరింగ్, లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు జరిపిన పరిక్షల్లో.. పాజిటివ్ వచ్చిందని తెలిపారు వైద్యులు.

మెరుగైన వైద్య చికిత్స కోసం శశికళను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెను చూసేందుకు అభిమానులు హస్పిటల్‌కు తరలిరాగా వారికి నమస్కరించడంతోపాటు చేయి ఊపి అభివాదం చేశారు. 69 ఏళ్ల శశికళకు.. జ్వరంతో పాటు శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితకు.. శశికళ ఆప్తురాలు.

అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకెళ్లిన శశికళ.. తన శిక్షాకాలం పూర్తి చేసుకొని ఈనెల 27న విడుదల కానున్నారు. ఆమె జైలు నుంచి తిరిగొచ్చాక.. తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయన్న ఆసక్తి అంతటా నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో.. శశికళకు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం చెలరేగుతోంది.