భారత్‌లో ట్రంప్ కోసం కడుతున్న గోడ ఎత్తు తగ్గించారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ముందు.. ఆయనకు ఓ మురికివాడ కనపడకుండా ఉండేందుకు ఓ భారీ గోడను నిర్మిస్తున్నారు. అహ్మదాబాద్‌లో రోడ్ షో నిర్వహించే మార్గంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇందిరా వంతెనకు అనుసంధానిస్తూ అర కిలోమీటరు మేర రోడ్డు పక్కనే మురికివాడ ఉంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రంప్ పర్యటన సందర్భంగా మురికి వాడ కనిపించకుండా గోడను నిర్మించాలనుకుంది. ముందుగా ఆరడుగుల కట్టాలని భావించారు.
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సబర్మతి వరకు ట్రంప్ రోడ్ షో సాగనుంది. దీనిని విజయవంతం చేయడానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మురికి వాడలు ట్రంప్‌కు కనిపించకుండా అధికారులు చేస్తున్న ప్రయత్నం చర్చనీయాంశం కాగా.. అక్కడి మేయర్ మాత్రం ఈ విషయం తనకు తెలియదని చెప్పడం విశేషం.
ఇప్పుడు ఈ గోడ ఎత్తులో మార్పులు ఉంటాయని చెప్తున్నారు. రోడ్ పక్కనే కడుతున్న గోడ నాలుగు అడుగుల ఎత్తు ఉంటే సరిపోతుందనే అధికారుల సూచన మేరకు పనులు జరుగుతున్నాయట. కారులో వెళ్తున్నప్పుడు ఆ ఎత్తు సరిపోతుందనుకున్నారో ఏమో.. అలా కానిచ్చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీలలో భారత్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్‌లో భారీ రోడ్ షో ఉండగా.. ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు ముందు సబర్మతి ఆశ్రమంలో సమగ్ర భద్రతా తనిఖీలు చేస్తున్నారు. ట్రంప్ తొలి అధికారిక భారత పర్యటన గురించి ఇప్పటికే వైట్ హౌస్ ప్రకటించింది.