Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో సహా ఆరు నెలల చర్చల తర్వాత ఈ సవరణను ప్రవేశపెట్టారు.

Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లుగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రపతి కార్యాలయం. వాడీవేడీ వాదోపవాదాల తర్వాత ఇటీవలే వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్, ఎంఐఎం, ఆప్ పార్టీలు న్యాయపోరాటానికి దిగాయి. ఈ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బిల్లుని వ్యతిరేకిస్తూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి.
వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం పేర్కొంది. వక్ఫ్ సవరణ బిల్లు.. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తుందని.. వక్ఫ్ ఆస్తులపై ఆక్రమణలను ఆపడానికి ప్రయత్నిస్తుందని తెలిపింది. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో సహా ఆరు నెలల చర్చల తర్వాత ఈ సవరణను ప్రవేశపెట్టారు.
Also Read : అయ్య బాబోయ్.. 10 అంతస్తుల బిల్డింగ్ సైజులో భారీ గ్రహశకలం.. మనమైతే సేఫ్.. చంద్రుడిని ఢీకొట్టబోతుందా?
రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు, వ్యతిరేకంగా 95 మంది ఓటు వేయడంతో ఆమోదం లభించింది. లోక్‌సభలో 288 మంది సభ్యులు మద్దతుగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు ఆమోదం పొందింది.
వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్షత కలిగి ఉందన్నారు. ముస్లింల ప్రాథమిక హక్కులను స్పష్టంగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. వారు పిటిషన్లు దాఖలు చేయడానికి అనేక కారణాలు తెలిపినా వక్ఫ్ (సవరణ) బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.
Also Read : ఇంజనీరింగ్ అద్భుతం.. మరో 100 ఏళ్ల వరకు చెక్కుచెదరని మన బ్రిడ్జి ఇది..
ఈ కొత్త చట్టంపై ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ చట్టం ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని అలాగే వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారిస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. వక్ఫ్ బోర్డులను జవాబుదారీగా చేయడం ద్వారా పారదర్శకతను తీసుకొస్తుందని ప్రభుత్వం వివరించింది. ఈ చట్టం వక్ఫ్ ఆస్తులను లాక్కుంటుందనే ఆరోపణల్లో నిజం లేదంది. ఏ మసీదు లేదా స్మశానవాటికను తాము తాకబోమని స్పష్టం చేసింది ప్రభుత్వం.