భయం పోయేందుకు పాటలు పాడారు..ఎక్సర్ సైజ్ చేశారు..చివరకు చావును ఎదిరించిన కార్మికులు

భయం పోయేందుకు పాటలు పాడారు..ఎక్సర్ సైజ్ చేశారు..చివరకు చావును ఎదిరించిన కార్మికులు

Updated On : February 10, 2021 / 3:21 PM IST

We sang Garhwali and Nepali songs : వారంతా టన్నెల్‌లో పనిచేస్తున్నారు. ఒక్కసారిగా జలప్రళయం. బయటపడేంత సమయమే లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. చూస్తుండగానే వరద, బురద ముంచెత్తింది. ఏం చేయాలో తెలియలేదు. అక్కడే ఉండిపోయారు. బతుకుతామన్న అశ చచ్చిపోయింది. అయితే వారి ప్రాణాలను పాటలే నిలిపాయి. ఒకరికి ఒకరు తోడుగా నిలవడమే వారి జీవితాలు శిథిలం కాకుండా కాపాడింది. ఉత్తరాఖండ్‌ తపోవన్‌ భూగర్భ సొరంగంలో చిక్కుకుని బతికి బయటపడ్డ వారి పరిస్థితి ఇది.

మెరుపు వరదలు.. ఒక్కసారిగా జలప్రళయం.. క్షణాల్లో చుట్టేసిన నీరు.. తప్పించుకునే మార్గమే లేదు. అసలు ఏం జరిగిందో కూడా తెలియదు వారికి. అయితే బతకాలనే ఆశనే వారిని రక్షించింది. ఇనుప రాడ్లు, ఒక ఎక్స్‌కవేటర్, మొబైల్ ఫోన్లలోని నెట్‌వర్క్ కనెక్షన్ వారి ఆశలను సజీవంగా ఉంచాయి. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు వారిని రక్షించేవరకు బిక్కు బిక్కుమంటూ గడపలేదు. ధైర్యం నింపుకొని చావును ఎదిరించారు. ఎలాగైనా బయటపడతామనే నమ్మకాన్ని పోగు చేసుకొని కారు చీకట్లను చీల్చుకుంటూ బయటకు వచ్చారు.

చమోలిలోని తపోవన్‌ సొరంగంలో 12 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారంతా ప్రాణ భయంతో మొదట ఆందోళన చెందారు. తర్వాత వారి ఆలోచన స్థితిని అందులోని కొంతమంది మార్చారు. పాటలు పాడడం మొదలు పెట్టారు. ఒకరికొకరు హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు. అయితే కాసేపయ్యాక టన్నెల్‌లో శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. భరించలేని చలి మొదలైంది. ఇదంతా జరుగుతున్నా వారు కుంగిపోలేదు. పన్నెండు మంది చలి నుంచి బయటపడటానికి ఒక జట్టుగా దగ్గరకు జరిగారు. జరుగుతున్నదంతా మన మంచికే అన్నట్లు చలికి వణుకుతూనే పాటలు పాడడం మొదలు పెట్టారు. ఉంటే ఉంటాం… పోతే పోయాం.. హ్యాపీగా మాత్రం ఉందాం అంటూ కేరింతలు కొట్టారు. గట్టిగా అరుస్తూ భయాన్ని పొగొట్టుకున్నారు.

పాటలు పాడుతూనే.. చలిని తట్టుకునేందుకు ఓ ఆలోచన చేశారు. చప్పట్లు కొడుతూ.. ఒకరినొకరు హత్తుకుంటూ ఒంటిలోకి ప్రవేశిస్తున్న చలిని తరిమికొట్టారు. వ్యాయామం మొదలు పెట్టారు. పుల్-అప్స్ తీశారు. ఇరుకైన గుంతను జిమ్‌గా మార్చుకున్నారు. ‘దిల్ హై కి మాంతా నహి’ అంటూ అందులో ఒకరు సాంగ్ పాడారు. ఇక అంతే మిగిలిన వారు కూడా అతన్ని అనుసరించారు. పాడుతా తీయగా తరహాలో పోటీ పడి మరీ పాటలు పాడారు. ఇంతలోనే వారిలో ఒక కార్మికుడికి ఫోన్‌కు సిగ్నల్‌ లభించింది. వెంటనే అతడు తన మేనేజర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆ మేనేజర్ వెంటనే స్థానిక అధికారుల వద్దకు పరుగెత్తుకెళ్లాడు. ఆ తర్వాత ఐటీబీపీ సీన్‌లోకి దిగి వారిని రక్షించారు. ఇలా ఆ ప్రాణాలు దక్కాయి.