సార్వత్రిక సమరంలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ.. మోదీని ఢీకొట్టి ఇండియా కూటమి నిలబడగలదా?

కాంగ్రెస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు కేసులు హస్తం పార్టీని చుట్టుముట్టాయి. వరుస ఐటీ నోటీసులు, అకౌంట్ల ఫ్రీజ్‌.. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఆర్థికంగా ఇబ్బందిపెడుతున్నాయి.

సార్వత్రిక సమరంలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ.. మోదీని ఢీకొట్టి ఇండియా కూటమి నిలబడగలదా?

Lok Sabha Elections 2024: జనరల్ ఎలక్షన్ పోరు జెట్ స్పీడ్‌తో కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్‌ ఎన్నికలకు ఇప్పటికే 102 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సెకండ్ ఫేజ్‌ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. అయినా ఇప్పటికీ ఇండియా కూటమిలో సీట్ల సర్ధుబాటు కొలిక్కి రావడం లేదు. బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై రెండ్రోజుల క్రితమే క్లారిటీకి వచ్చారు. మరోవైపు మహారాష్ట్రలో మాత్రం ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.

జయంత్ చౌదరి నేతృత్వంలోని RLD ఇండియా కూటమి నుండి విడిపోయి NDAలో చేరింది. జేడీయూ-ఆర్‌ఎల్‌డీ ఎన్డీయేలో చేరడం ప్రతిపక్ష కూటమికి పెద్ద దెబ్బ. జమ్మూకాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, బెంగాల్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఒంటరిగా వెళ్తున్నారు. సీట్ల పంపకం విషయంలో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీహార్‌లో ఆర్జేడీ పెట్టిన షరతులకు కాంగ్రెస్ అంగీకరించాల్సి వచ్చింది. 80 సీట్లు ఉన్న యూపీలో కాంగ్రెస్ 17 సీట్లలోనే పోటీ చేస్తుంది.

పొత్తులపై కాంగ్రెస్‌కు షాక్
సింగిల్‌గా మోదీని ఢీకొట్టి అధికారంలోకి రాలేమని భావించిన కాంగ్రెస్.. పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇండియా కూటమిగా 20కి పైగా పార్టీలను కలుపుకుని ముందుకెళ్తుంది. అయితే పొత్తులపై కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ వస్తున్నాయి పలు పార్టీలు. సీట్ల సర్ధుబాటులో లెక్కలు కుదరక ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ. ఇక కూటమి ఏర్పాటుకు ముందుండి నడిచిన బిహార్ సీఎం నితీష్ కుమార్ టైమ్ చూసి కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి.. ఎన్డీయేతో దోస్తీ షురూ చేశారు.

కాంగ్రెస్‌కు కష్టాలు
కూటమి కథ అట్లుంటే కాంగ్రెస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు కేసులు హస్తం పార్టీని చుట్టుముట్టాయి. వరుస ఐటీ నోటీసులు, అకౌంట్ల ఫ్రీజ్‌.. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఆర్థికంగా ఇబ్బందిపెడుతున్నాయి. లేటెస్ట్ గా 3వేల 5వందల కోట్ల రూపాయల పన్ను రికవరీ కోసం కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు ఇచ్చింది. అంతకుముందు 18 వందల 23 కోట్లకు సమన్లు ఇచ్చారు. దానికంటే ముందు అకౌంట్లలో అమౌంట్ ఫ్రీజ్ చేసింది ఐటీ. ఈ ఇష్యూపై కోర్టులు, ఐటీ ట్రైబ్యునల్‌కు వెళ్లినా న్యాయం జరగడం లేదని ఏఐసీసీ అగ్రనేతలు ప్రెస్‌ మీట్ పెట్టి చెప్పినా పట్టించుకున్న నాధుడే లేడు. ఇండియా కూటమిలోని ఏ పార్టీ ఈ విషయంలో కాంగ్రెస్‌కు అండగా నిల్వలేదు. ప్రెస్‌మీట్లు పెట్టడం వరకే పరిమితం అవడం తప్ప ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నది మాత్రం ఏం లేదు.

Also Read: బీజేపీ మళ్లీ గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పిన రాహుల్ గాంధీ

వెంటాడుతున్న ఈడీ, సీబీఐ కేసులు
ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో నడుస్తున్న ఆప్ పార్టీని ఈడీ, సీబీఐ కేసులు వెంటాడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీ-గుజరాత్-హర్యానాలో సీట్ల షేరింగ్‌తో పోటీ చేస్తోంది కాంగ్రెస్. కేజ్రీవాల్‌ క్లీన్ ఇమేజ్‌ కలసి వస్తుందని భావించిన కాంగ్రెస్‌కు పెద్దషాకే తగిలింది. ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయి జైల్‌లో ఉన్నారు. ఆ పార్టీ ప్రముఖ నేతలపై అవినీతి ఆరోపణలు, కేసులు కాంగ్రెస్‌కు ప్రతికూల అంశాలనే చెప్పొచ్చు. అవినీతిరహిత పాలన పేరుతో ఢిల్లీ, పంజాబ్‌లో పాగా వేసిన ఆప్.. ఇండియా కూటమి అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషిస్తుందని భావించారంతా. కానీ సీన్ రివర్స్ అయింది. కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు.

మహారాష్ట్రలోనూ ముసలం
ఇక కేరళలో సీఎం విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ ప్రత్యర్థులుగా ఉన్నాయి. మహారాష్ట్రలోనూ ముసలం మొదలైంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే, ముంబై నార్త్ వెస్ట్ సీటుకు శివసేన ఉద్ధవ్‌ వర్గం అభ్యర్థిని ప్రకటించడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు జార్ఖండ్‌లో 14 సీట్లకు గానూ 8 స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని సీపీఐ ప్రకటించింది.

Also Read: దేశ ప్రజలకోసం ఆరు గ్యారెంటీలు.. కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించిన సునీతా కేజ్రీవాల్

త్యాగాలు చేసి.. సొంతపార్టీ నేతలకు టికెట్లు ఇవ్వకుండా పొత్తులతో ఎన్నికలకు వెళ్తుంది కాంగ్రెస్. ఎంత కాంప్రమైజింగ్‌కు వెళ్లినా కూటమి పార్టీలు కాంగ్రెస్‌తో సీట్ల షేరింగ్‌పై పట్టువదలడం లేదు కూటమి పార్టీలు. నామినేషన్లు స్టార్ట్ అయినా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. అభ్యర్థులు ఎవరో తేల్చుకోలేకపోతుంది ఇండియా కూటమి.