పొగమంచుతో విమాన సర్వీసులకు ఆటంకం.. జీరో విజిబిలిటీలో విమానాలను ఎలా ల్యాండ్‌ చేస్తారు?

సాధారణంగా విమానాశ్రయాల్లో విమానాల ల్యాండింగ్‌ సక్రమంగా నిర్వహించేందుకు ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్ సిస్టమ్‌ రేడియో నావిగేషన్‌.. ILSను వినియోగిస్తారు.

పొగమంచుతో విమాన సర్వీసులకు ఆటంకం.. జీరో విజిబిలిటీలో విమానాలను ఎలా ల్యాండ్‌ చేస్తారు?

what is an ILS and how the instrument landing system works

Updated On : January 17, 2024 / 8:02 PM IST

Instrument Landing System: దేశంలో రోజురోజుకు విమాన ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గతేడాది దేశవ్యాప్తంగా 22 కోట్లకు పైగా ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు. ఈ సంఖ్య వచ్చే ఏడాదికి ఏకంగా 14 నుంచి 16 శాతం పెరిగి 25 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉంది. డొమెస్టిక్‌ విమానాల్లోనే గతేడాది 15 కోట్లకు పైగా ప్యాసింజర్స్‌ విమానాల్లో ప్రయాణించారు. వచ్చే ఐదేళ్లలో అంటే 2029 నాటికి విమానాల సంఖ్యతో పాటు ప్రయాణికుల సంఖ్య ఇప్పటితో పోల్చుకుంటే రెట్టింపు అవుతుంది.

విమానాశ్రయాల్లో వార్ రూమ్స్‌
ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. దేశంలో గత కొద్ది రోజులుగా పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ల్యాండ్‌ అయ్యే సమయంలో కానీ, టేకాఫ్‌ అయ్యే సమయంలో కానీ పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమనాలను పూర్తిగా రద్దు చేస్తున్నారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తమ గమ్యస్థానాలకు చేరుకోలేక తిప్పలు పడుతున్నారు. దీంతో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు గత రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ సహా అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో వార్ రూమ్స్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఐఎల్‌ఎస్‌ అంటే..?
సాధారణంగా విమానాశ్రయాల్లో విమానాల ల్యాండింగ్‌ సక్రమంగా నిర్వహించేందుకు ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్ సిస్టమ్‌ రేడియో నావిగేషన్‌.. ILSను వినియోగిస్తారు. ఇది అందించే రేడియో సిగ్నల్స్‌ ఆధారంగా విమానాన్ని పైలట్లు ల్యాండ్‌ చేస్తారు. ఈ వ్యవస్థకు 10 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. ఇందులో రెండు రేడియో సిగ్నల్స్‌ ఉంటాయి. విమానం ల్యాండ్‌ అయ్యేందుకు ఎడమ, కుడి వైపు మార్గదర్శకాలు ఇస్తాయి. అలాగే పైకి, కిందికి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చేందుకు గ్లైడ్‌ స్లోప్‌ అనే పరికరం ఉంటుంది. సాధారణంగా విజిబిలిటీ 275 నుంచి 550 మధ్య ఉన్నప్పుడు విమానాలకు, పైలట్లకు క్యాటగిరీ-2 విధివిధానాలు వర్తిస్తాయి.

సున్నా విజిబిలిటీ ఉంటే..?
ఇక 275 నుంచి 50 మీటర్లకు విజిబిలిటీ పడిపోతే క్యాటగిరీ-3 విధివిధానాలను పాటిస్తారు. 50 మీటర్లకు అటూ ఇటూగా విజిబిలిటీ ఉంటే క్యాటగిరీ-3బీ సర్టిఫికెట్లు ఉన్న పైలట్లు మాత్రమే ల్యాండ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక సున్నా విజిబిలిటీ ఉంటే క్యాటగిరీ-3 సీ విధివిధానాలు పాటిస్తూ ఆటో పైలట్‌ మోడ్‌లోనే ల్యాండ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థను ప్రస్తుతం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో మాత్రమే వినియోగిస్తున్నారు.

Also Read: లక్షద్వీప్‌కు వెకేషన్‌ వెళ్లాలనుకుంటున్నారా.. పూర్తి వివరాలు ఇవిగో?

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నాలుగు రన్‌వేలు ఉన్నాయి. వాటిలో రెండు మాత్రమే ILS క్యాటగిరీ-3బీ ప్రమాణాల ప్రకారం ఉన్నాయి. అయితే వాటిలో కూడా ఒకటి చాలా రోజులుగా నిరుపయోగంలో ఉంది. మరొక రన్‌వే కూడా క్యాటగిరీ-1 ప్రమాణాలకు పడిపోయిందని చెబుతున్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగానే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు. విజిబిలిటీ కనీసం 125 మీటర్లు ఉంటే తప్ప ఈ రన్‌వేపై విమానాలు ఎగరలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి.

Also Read: అటల్‌సేతు పిక్నిక్ స్పాట్ కాదు.. వెహికిల్స్ ఆపి ఫొటోలు తీశారో..

ILSకు ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌
కొన్ని విమానాశ్రయాల్లో ILS వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌ వాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జీపీఎస్‌ ద్వారా సున్నా విజిబిలిటీ ఉన్న పరిస్థితుల్లో కూడా పైలట్లు విమానాన్ని ల్యాండ్‌ చేసే అవకాశం ఉంటుంది. అయితే వాతావరణ ప్రతికూలతల సమయంలో జీపీఎస్‌ సిగ్నల్స్‌కు అంతరాయం కలిగే ప్రమాదం ఉంటుంది. అయితే మైక్రోవేవ్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌ చాలా కచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే ఈ వ్యవస్థ చాలా ఖర్చుతో కూడుకున్నది.