విజయ్ సత్తా తేలిపోయింది.. ఇండియా టుడే సంచలన సర్వే.. తమిళనాట ఎవరి హవా ఎంతంటే..?
ఓట్ల శాతాన్ని నియోజక వర్గాల్లో సీట్లు గెలిచే వ్యూహంగా మార్చుకునే సామర్థ్యం ఇండియా బ్లాక్‌కు ఉందని ఇది తెలియజేస్తోంది.
Stalin, Vijay, Annamalai (Image Credit To Original Source)
- ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే టీవీకేకు 0 సీట్లు
- తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలు..
- అందులో 38 స్థానాల్లో ఇండియా కూటమి గెలుపు!
Tamil Nadu: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే తమిళనాడులోని 39 స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై “ఇండియా టుడే-సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే”లో ఇండియా బ్లాక్ గెలుస్తుందని తేలింది.
సినీనటుడు విజయ్ స్థాపించిన టీవీకే ఒక్క స్థానంలోనూ గెలవదని సర్వే ద్వారా తెలిసింది. సర్వే ప్రకారం.. టీవీకేలాంటి కొత్త రాజకీయ శక్తుల ఓట్ల శాతం 2024లో 12.. 2025 ఆగస్టులో 15.. 2026 జనవరిలో 22గా ఉంది.
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే టీవీకేకు ఓట్ల శాతం చెప్పుకోదగ్గ రీతిలోనే వస్తుంది. సర్వే ప్రకారం టీవీకేకు 15 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అయినప్పటికీ, ఓట్ల శాతాన్ని ఆయా లోక్‌సభ స్థానాల్లో గెలుపుగా మార్చుకునే సత్తా టీవీకేకు లేదని సర్వే స్పష్టం చేసింది. ఇండియా బ్లాక్ ఆధిపత్యం చూపుతున్నప్పటికీ కొత్త పార్టీలకు మొత్తం కలిపి 22 శాతం ఓట్లు వస్తాయని తేలడం గమనార్హం.
38 స్థానాలు ఇండియా బ్లాక్‌కే
తమిళనాడులో ఏప్రిల్-మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే-సీవోటర్ నిర్వహించిన సర్వేకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా లోక్‌సభ స్థానాల్లో మాత్రమే గెలుపు, ఓటముల అంశంపై ఇండియా టుడే-సీవోటర్ అంచనాలను వెల్లడించింది.
Also Read: తెలంగాణలో జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా? మరో రెండు, మూడ్రోజుల్లో..
లోక్‌సభ ఎన్నికలు ఈ నెలలో జరిగితే తమిళనాడులోని 39 స్థానాల్లో 38 స్థానాలను ఇండియా బ్లాక్ దక్కించుకుంటుందని సర్వే అంచనా. ఎన్డీఏ ఒక్క స్థానంలోనే గెలిచే అవకాశం ఉంది.
తమిళనాడులో ఇండియా బ్లాక్‌కు మద్దతు బాగా ఉంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఇండియా బ్లాక్‌లోని పార్టీలదే హవా. ఈ ఆధిపత్యం ఇంకా కొనసాగుతోందని సర్వే సూచిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి 39కి 39 స్థానాలు సాధించింది.
ఇది రాష్ట్ర ఓటర్లపై ఇండి కూటమికి ఉన్న పట్టును స్పష్టంగా చూపించింది. 2025 ఆగస్టులో చేసిన సర్వేలో ఇండి కూటమి 35-36 స్థానాలను గెలుచుకుంటుందని అంచనాలు వెలువడ్డాయి.
తాజా సర్వేలో మళ్లీ ఇండి కూటమి 38 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఓట్ల శాతాన్ని నియోజక వర్గాల్లో సీట్లు గెలిచే వ్యూహంగా మార్చుకునే సామర్థ్యం ఇండియా బ్లాక్‌కు ఉందని ఇది తెలియజేస్తోంది.
ఎన్డీఏ పతనం
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు తమిళనాడులో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజా సర్వే ప్రకారం.. ఎన్డీఏ ఒక్క స్థానంలో మాత్రమే గెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా కనిపిస్తున్నా తమిళనాడులో మాత్రం ముందడుగు వేయలేని పరిస్థితి ఉంది.
