Farmer kills leopard : నా కొడుకు జోలికొస్తావా..! చిరుతపులితో వీరోచితంగా పోరాడి కన్న కొడుకును కాపాడుకున్న 60ఏళ్ల రైతు..
Farmer kills leopard : గిర్ సోమనాథ్ జిల్లాలోని గాంగ్దా గ్రామంలో 60ఏళ్ల రైతు చిరుతపులి దాడి నుంచి తనను, తన కొడుకు ప్రాణాలను కాపాడుకున్నాడు.
Farmer kills leopard and saves childFarmer kills leopard and saves child
Farmer kills leopard : ఏ కుటుంబానికైనా పెద్ద తండ్రి. తన కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏ కష్టమొచ్చినా తండ్రి చూస్తూ ఊరుకోడు. అలాంటిది కొడుకు ప్రాణాలు తీసేందుకు చిరుతపులి ప్రయత్నిస్తే ఊరుకుంటాడా.. తన ప్రాణాలను అడ్డుపెట్టి చిరుతపులితో పోరాడి కొడుకును కాపాడుకున్నాడు. కన్నకొడుకును రక్షించుకోవటానికి ఆ తండ్రి చేసిన పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
గిర్ సోమనాథ్ జిల్లాలోని గాంగ్దా గ్రామంలో 60ఏళ్ల రైతు బాబు వాజా తన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. చుట్టూ చిమ్మచీకటి.. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక్కసారిగా పొలాల్లో నుంచి ఒక చిరుతపులి ఆకలిగొన్న రాక్షసిలా బాబు మీదకు దూసుకొచ్చింది. బాబు చేతిని పట్టుకుని ఈడ్చుకెళ్లే ప్రయత్నంలో ఆయన పెట్టిన కేకలు విని కొడుకు శార్దూల్ పరుగున వచ్చాడు. దీంతో ఆ పులి రైతు బాబు వాజాను వదిలేసి కొడుకు శార్దూల్ మీదకు దూసుకెళ్లింది. చిరుతపులి తన కొడుకువైపు దూసుకెళ్లి దాడి చేస్తున్న క్రమంలో కొడవలి, ఈటెతో 60ఏళ్ల వృద్ధుడు చిరుతతో వీరోచితంగా పోరాటం చేసి హతమార్చాడు. తద్వారా తన ప్రాణాలతోపాటు తన కొడుకును కాపాడుకున్నాడు.
ఈ ఘటనపై బాబు వాజా మాట్లాడుతూ.. నేను రాత్రి షెడ్లో నిద్రిస్తున్నప్పుడు చిరుతపులి నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నా చెయ్యిని పట్టుకొని లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో నేను పెద్దగా కేకలు వేయడంతో నా కొడుకు అక్కడికి వచ్చాడు. ఆ చిరుతపులి నన్ను వదిలేసి నా కొడుకుపై దాడికి యత్నించింది. నా కొడుకును రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు చిరుతపులి మళ్లీ నాపై దాడి చేసింది. ఇలా పలుసార్లు జరిగిన తరువాత నేను కర్రతో చిరుతపై దాడి చేశాను.. ఆ పక్కనే ఉన్న కొడవలితో చిరుతను చంపేశాను. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పాడు.
ఈ ఘటనలో తండ్రి, కొడుకు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని మొదట ఉనాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ, మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అటవీశాఖ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చిరుతపులి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. రైతు, అతని కుమారుడు ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
