UGC Regulations 2026: యూజీసీ కొత్త రూల్స్ పై రచ్చరచ్చ.. అసలు నిబంధనల్లో ఏముంది? వివాదం ఏంటి? ఎందుకింత వ్యతిరేకత?
రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ నిబంధనలు-2012 స్థానంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
UGC Regulations 2026 Representative Image (Image Credit To Original Source)
- కొత్త రూల్స్ కేవలం రిజర్వ్డ్ కేటగిరీల రక్షణకు మాత్రమే ఉన్నాయని ఆందోళనలు
- జనరల్ కేటగిరీ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటే ఎవరికి చెప్పుకోవాలి?
- ఈ నిబంధనలు అనుకోకుండా కొత్త విభజనలకు దారితీయచ్చు?
UGC Regulations 2026: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త రూల్స్ పై వివాదం నెలకొంది. దీనిపై కొంత కాలంగా పెద్ద చర్చే జరుగుతోంది. కొంతమంది వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా UGC తెచ్చిన కొత్త నిబంధనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం స్టే విధించింది. యూజీసీ కొత్త రూల్స్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీటిని దుర్వినియోగం చేసే ప్రమాదమూ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి నోటీసులు ఇచ్చింది. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కొత్త రూల్స్ పై స్టే అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపి సమానత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో యూజీసీ తెచ్చిన ‘ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్- 2026’ వివాదానికి దారితీశాయి. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. సామాజిక న్యాయం కోసం ఈ రూల్స్ తెచ్చామని యూజీసీ, కేంద్రం చెబుతుండగా.. జనరల్ కేటగిరీ విద్యార్థులు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నిబంధనల అమలుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్ అమలుపై స్టే విధించింది.
కొత్త రూల్స్ ఏంటి?
ప్రతి ఉన్నత విద్యా సంస్థలో ‘సమానత్వ (ఈక్విటీ) కమిటీ’ల ఏర్పాటును యూజీసీ మస్ట్ చేసింది. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది. కులం, మతం, లింగం, వికలాంగత, జాతి వంటి వివక్షలపై ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ ప్రత్యేక సెల్లు పని చేస్తాయి. ఏదైనా వివక్షపై ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు కమిటీ సమావేశం కావాలి. ఈ ఘటనపై 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి.. 7 రోజుల్లో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల కోసం 24/7 హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేయాలి. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ నిబంధనలు-2012 స్థానంలో కొత్త నిబంధనలను జనవరి 13న తీసుకొచ్చింది.
విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
సమానత్వ కమిటీల ఏర్పాటు ఆదేశాలను వామపక్ష విద్యార్థి సంఘాలు సమర్థించాయి. అయితే, కొత్త నిబంధనలలోని కులవివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై జనరల్, ఇతర కేటగిరీల విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ రూల్స్ కేవలం రిజర్వ్డ్ కేటగిరీల రక్షణకు మాత్రమే ఉన్నాయని.. కానీ జనరల్ కేటగిరీ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటే ఎవరికి చెప్పుకోవాలో స్పష్టత లేదని ఆరోపించారు. ఈ నిబంధనలు అనుకోకుండా కొత్త విభజనలకు దారితీయవచ్చన్నారు. అలాగే దుర్వినియోగం జరగకుండా సరైన రక్షణలు లేవన్నారు. తప్పుడు ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే యూజీసీ నిబంధనలను సవాల్ చేస్తూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుల ఆధారిత వివక్ష కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకంగా మాత్రమే జరుగుతుందన్న భావన ఆధారంగా ఈ ఉత్తర్వులను యూజీసీ రూపొందించిందని అందులో పేర్కొన్నారు. కులం ఆధారంగా జనరల్ లేదా నాన్ రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులు కూడా వివక్షను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కులానికి తావివ్వనిరీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలా యూజీసీకి ఆదేశాలు ఇవ్వాలని పిల్లో పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కొత్త రూల్స్ అమలుపై స్టే విధించింది. ఈ నిబంధనల అమలుకు స్వేచ్ఛ, సమానత్వం, సమగ్రతతో కూడిన వాతావరణం అవసరం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
యూజీసీ కొత్త నిబంధనలపై జనరల్ కేటగిరీ విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. UGC బిల్లు 2026 ప్రధానంగా ఉన్నత విద్యాసంస్థల్లో కుల ఆధారిత వివక్షతో పాటు ఇతర రకాల వివక్షను నివారించడానికి రూపొందించబడిందని తెలిపారు. ఈ కొత్త నిబంధనలను ఎవరూ దుర్వినియోగం చేయకుండా చూస్తామని, ఎవరిపైనా వివక్ష ఉండదని ఆయన హామీ ఇచ్చారు. రోహిత్ వేముల, పాయల్ తద్వి వంటి విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ మార్పులు తెచ్చినట్లు ఆయన వివరణ ఇచ్చారు.
