Happy Bakrid : కరోనా వేళ…WHO మార్గదర్శకాలు

  • Published By: madhu ,Published On : July 31, 2020 / 09:05 AM IST
Happy Bakrid : కరోనా వేళ…WHO మార్గదర్శకాలు

Updated On : July 31, 2020 / 11:10 AM IST

కరోనా వేళ..పండుగలను ఘనంగా చేసుకోలేకపోతున్నారు జనాలు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్చి నుంచి మొదలైన వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో వస్తున్న పండుగులను ఏదో..ఏదో..అన్నట్లుగా ముగించేస్తున్నారు. 2020, జులై 31వ తేదీ శ్రావణ శుక్రవారం, బక్రీద్ పండుగలు వచ్చాయి.



నిబంధనలు పాటిస్తూ..పండుగలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి. బక్రీద్ పండుగ సందర్భంగా..ఇళ్లలోనే ప్రార్థన చేసుకోవాలని, ఆవులను వధించవద్దని సూచిస్తున్నారు. తాజాగా..కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

భౌతిక దూరం, శానిటైజ్, మాస్క్ లు తప్పనిసరిగా వాడాలని సూచించింది. జంతువులను వధించే సమయంలో..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది. శుభాకాంక్షలు తెలిపే సమయంలో భౌతిక దూరం పాటించాలని, కౌగిలింతలు వద్దని తెలిపింది. విభిన్న మార్గాల్లో విషెష్ తెలియచేయాలని, చేయి ఊపడం తదితర చర్యలతో బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకోవచ్చని వెల్లడించింది.



పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమి కూడవద్దని, మార్కెట్లు, మసీదుల వద్ద రద్దీ ఉండకుండా చూడాలంది. అనారోగ్యంగా ఉన్న గొర్రెలు, ఇతర జంతువులను వధించవద్దని, అస్వస్థతతో ఉన్న వాటిని ఐసోలేషన్ లో ఉంచాలని స్పష్టం చేసింది.

జంతువుల నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుందనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కానీ..ఇది నిజంగా జరుగుతుందా ? అనే దానిపై ఓ స్పష్టత రాలేదు. కానీ..జీవాల నుంచి ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయని పలువురు సూచిస్తున్నారు.