CAA, NRCలకు వ్యతిరేకంగా ముగ్గులు: పోలీసుల అదుపులో మహిళలు

సీఏఏ, ఎన్నార్సీలపై వినూత్న రీతిలో ఆందోళన మొదలైంది. గృహిణులు ముగ్గులు వేసి నో టు సీఏఏ, నో టు ఎన్నార్సీ అని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజూ సాంప్రదాయబద్ధంగా ఇంటి బయట వేసుకునే ముగ్గులతో పాటు ఈ నినాదాలు కూడా రాశారు మహిళలు. ఈ ఘటన బీసెంట్ నగర్ ప్రాంతంలో జరిగింది. నలుగురు మహిళలతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసెంబ్లీని అవమానించేలా ఉన్నాయనే కారణంతో పోలీసులు ఇలా చేసినట్లు వెల్లడించారు. కాసేపటి తర్వాత వారిని విడుదల చేశారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వం అసమ్మతిని తెలియజేసే హక్కును కూడా ప్రజల నుంచి లాగేసుకుంటుందని ఆరోపించారు.
సీఏఏ, ఎన్నార్సీలపై ఫైల్ అయిన కేసులు విత్ డ్రా చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా పలు రాష్ట్రాల్లో ఈ అంశాలపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో సెగలు రగులుతూనే ఉన్నాయి.
ఆందోళనలను అణచివేయాలని కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీసేలా కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ఆదాయానికి నష్టం వస్తుందని తెలిసినా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం.