Meerut Murder Case: మరో భర్త బలి.. నిద్ర మాత్రలు ఇచ్చి, పాముతో కరిపించి.. మీరట్ లో భార్య ఘాతుకం
ఒక మహిళ, ప్రియుడితో కలిసి చేసిన ఘోరమే మీరట్(Meerut Murder Case)లోని హస్తినాపూర్‌లో సంచలనం సృష్టించింది.
Wife in Meerut has husband killed by snakebite to claim insurance money.
- వివాహేతర బంధం తెచ్చిన ఘోరం.
- బీమా డబ్బుల కోసం ప్లాన్.
- పాము కాటుతో భర్త హత్య.
Meerut Murder Case: ప్రేమించి పెళ్లాడిన భర్తను కాదనుకుని, వివాహేతర సంబంధానికి అలవాటు పడిన ఒక మహిళ, ప్రియుడితో కలిసి చేసిన ఘోరమే మీరట్(Meerut Murder Case)లోని హస్తినాపూర్‌లో సంచలనం సృష్టించింది. ఒక పబ్లిక్ స్కూల్ నడుపుతున్న అతుల్ పన్వార్, అతని భార్య దామిని జీవితంలోకి అదే స్కూల్ డ్రైవర్ తుషార్ ప్రవేశించడంతో కథ విషాదాంతమైంది. భర్తను వదిలించుకుని, అతని పేరు మీద ఉన్న రూ. 20 లక్షల బీమా సొమ్మును కాజేయడమే లక్ష్యంగా దామిని, తుషార్ ఒక కిరాతక పథకాన్ని రచించారు.
మొదట అతుల్‌ను కారుతో ఢీకొట్టి చంపాలని చూసి విఫలమవ్వడంతో, ఈసారి మరింత క్రూరమైన ‘స్నేక్ మర్డర్’ స్కెచ్ వేశారు. ఐదు లక్షల సుపారీ ఒప్పందంతో మరో ఇద్దరి సహాయం తీసుకున్నారు. గురువారం రాత్రి దామిని తన భర్తకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి గాఢ నిద్రలోకి జార్చింది. అనంతరం తుషార్ తన అనుచరులతో కలిసి, ముందే కొనుగోలు చేసిన ఒక విషసర్పంతో లోపలికి వచ్చి, అతుల్ పడుకున్న దుప్పటి కింద వదిలేశారు. ఆ పాము కాటుకు గురై అతుల్ రాత్రికే ప్రాణాలు కోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్లు దామిని డ్రామాలు ఆడింది.
అయితే, మంచంపై పాము కనిపించడంపై అనుమానం వచ్చిన పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజం బయటపడింది. దామిని మొబైల్ కాల్ డేటాను పరిశీలించగా డ్రైవర్ తుషార్‌తో ఉన్న సంబంధం బయటపడింది. అనంతరం తుషార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతని మొబైల్లో లభించిన ‘డబ్బాలో బంధించిన పాము ఫోటో’ కేసులో అత్యంత కీలకమైన డిజిటల్ ఆధారంగా మారింది. దీంతో భార్య, ప్రియుడు సహా నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
