బీజేపీకి మమతా సవాల్…నిరూపిస్తే 101 గుంజీలు తీస్తా

అక్టోబర్ నెలలో వచ్చే దసరా పండగను ప్రతి ఏటా కోల్ కతాలో ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది దుర్గా పూజకు తమ ప్రభుత్వం అనుమతివ్వలేదంటూ వాట్సప్ గ్రూపులతో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
ఈ ఏడాది దుర్గాపూజ వద్దని తాను అన్నట్లుగా నిరూపిస్తే.. ప్రజల ముందు 101 సార్లు గుంజీలు తీస్తానని మమతా సవాలు విసిరారు. దసరా సందర్భంగా జరిపే దుర్గా పూజపై ఇప్పటి వరకు తాను ఎలాంటి సమావేశం జరుపలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మమత స్పష్టంచేశారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మమత తెలిపారు.
బెంగాల్ పోలీస్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రతి ఏడాది సెప్టెంబర్ 1న బెంగాలో పోలీసు డే నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఈ కార్యక్రమం నేటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా మమతా.. కోల్‌కతా పోలీసుల ధైర్య సాహసాలను ప్రశంసించారు. కరోనా నియంత్రణ కోసం వారు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.