మనుషులను చంపేస్తున్న తోడేళ్లు.. నిద్రలేని రాత్రులు గడుపుతున్న పల్లె ప్రజలు.. ఆపరేషన్‌ భేడియాతో అడ్డుకట్ట పడేనా..?

ఒకటి కాదు రెండుకాదు. ఏకంగా నెలన్నర రోజులుగా ఆ 30 గ్రామాలకు చుక్కలు చూపిస్తున్నాయి తోడేళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులను వణికించేస్తున్నాయి.

మనుషులను చంపేస్తున్న తోడేళ్లు.. నిద్రలేని రాత్రులు గడుపుతున్న పల్లె ప్రజలు.. ఆపరేషన్‌ భేడియాతో అడ్డుకట్ట పడేనా..?

Wolves Hunting in Uttar Pradesh

Wolves Hunting : ఒకటి కాదు రెండుకాదు. ఏకంగా నెలన్నర రోజులుగా ఆ 30 గ్రామాలకు చుక్కలు చూపిస్తున్నాయి తోడేళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులను వణికించేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 30 ఘటనలు జరిగాయి. రాత్రి సమయాల్లో గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. ఇప్పటివరకు 30 మంది గాయపడ్డారు. తోడేళ్ల భయంతో 30 గ్రామాల జనం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాత్రంతా కాపలా కాస్తున్నారు. ఇళ్లలో చిన్నారులను చీరలతో తమకు కట్టేసుకుని పడుకుంటున్నారు మహిళలు.

భయం గుప్పిట్లో ప్రజలు..
తోడేళ్ల హడల్‌తో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వరుస ఘటనలతో అప్రమత్తమైన బహ్రైచ్ జిల్లా కలెక్టర్‌ మోనికా రాణి..గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి..బహిరంగ ప్రదేశాల్లో పడుకోవద్దని ప్రజలకు సూచించారు. ఖరీఘాట్‌లోని ఛత్తర్‌పూర్‌లో మూడు, ఆరు, తొమ్మిదేళ్ల వయస్సున్న ముగ్గురు పిల్లలపై తోడేళ్లు దాడి చేయడంతో వారు గాయపడ్డారు. అలాగే తల్లిదండ్రులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్న ఐదేళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లి చంపి తిన్నాయి తోడేళ్లు. మరోవైపు తోడేళ్ల దాడులను నియత్రించే ఆపరేషన్‌లో నాలుగు జిల్లాల డివిజనల్ ఫారెస్ట్ అధికారులు బిజీ అయిపోయారు. తోడేళ్ల గుంపు కదలికలను పర్యవేక్షించేందుకు హై ఫ్రీక్వెన్సీ డ్రోన్ కెమెరాలు వాడుతున్నారు. ఈ కెమెరాల్లో తోడేళ్లు సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రోన్ల సాయంతో ఇప్పటి వరకు ఏడు తోడేళ్లను బంధించినట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే గ్రామాలపై తోడేళ్లు అటాక్స్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏనుగు పేడ, మూత్రంతో తోడేళ్లను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.

రెండు నెలలుగా ఎక్కువైన తోడేళ్ల దాడులు ..
ఖారీపైర్‌లోని ఛత్తర్‌పూర్‌లో సోమ, మంగళవారం మధ్య రాత్రి ముగ్గురు పిల్లలపై దాడి చేశాయి తోడేళ్లు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకునేలోపే తోడేళ్లు దగ్గరలోని రాయ్‌పూర్ గ్రామానికి వెళ్లాయి. అక్కడ ఐదేళ్ల చిన్నారిని ఇంటి నుంచి పట్టుకెళ్లాయి. ఈ ప్రాంతంలో గత రెండు నెలలుగా తోడేళ్ల దాడులు ఎక్కువ అయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది చిన్నారులు, ఒక మహిళ సహా తొమ్మిది మంది చనిపోయారు. అటవీశాఖతో పాటు పోలీసులు, నాలుగు జిల్లాల డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ల స్పెషల్ ఆపరేషన్‌లో ఏడు తోడేళ్లు పట్టుబడ్డాయి. అందులో ఒకటి హర్ట్‌ స్ట్రోక్‌తో చనిపోయింది.

ఏనుగు పేడకు నిప్పంటించి..
ఏనుగు పేడకు నిప్పటించడం, దగ్గరలో ఏనుగు లాంటి పెద్ద జంతువులు ఉన్నాయని భ్రమ కల్పించి తోడేళ్లు జనాలకు దూరంగా వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. వేటాడే గుణం ఉన్న తోడేళ్లు, ఏనుగు లాంటి పెద్ద జంతువుల జోలికి వెళ్లవని చెప్తున్నారు. తోడేళ్ల దాడిని తప్పించుకునేందుకు గ్రామస్తులు రాత్రింబవళ్లు నిద్రకాసి కాపలాగా ఉంటున్నారు. అయితే తోడేళ్లు సంచరిస్తున్న ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు కరెంట్ సప్లై సరిగా లేనట్లు తెలుస్తోంది. లైట్లు లేక, చీకటి కారణంగా తోడేళ్లు దాడులు చేస్తున్నట్లు జనం చెప్తున్నారు. ఈ ప్రాంతంలో పేదరికం ఎక్కువగా ఉందని, చాలామందికి పక్కా ఇళ్లు లేకపోవడంతో ఆరుబయటే పడుకుంటారని, అలాంటివారికి తోడేళ్ల నుంచి మరింత ప్రమాదం ఎదురవుతోందని అటవీ అధికారులు చెప్తున్నారు. తోడేళ్ల దాడిలో చనిపోయినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షలు, అటవీ శాఖ నుంచి రూ. లక్ష కలిపి మొత్తం రూ. 5 లక్షల పరిహారం ఇస్తున్నారు.

ఆపరేషన్‌ భేడియా పేరుతో సెర్చ్ ఆపరేషన్ ..
తోడేళ్ల దాడులు యూపీని వణికించేస్తున్నాయి. ఒకే ఒక డిస్ట్రిక్ట్‌లో 30 గ్రామాల ప్రజలకు రేపన్నది ఉంటుందో లేదో అన్న ఆందోళన కలిగిస్తున్నాయి తోడేళ్లు. నెలన్నర వ్యవధిలోనే తొమ్మిది మందిని పొట్టనపెట్టుకొన్న తోడేళ్ల గుంపును వేటాడుతున్నారు అధికారులు. ఆపరేషన్‌ భేడియా పేరుతో సెర్చ్ ఆపరేషన్ నడుస్తోంది. మొదట మనుషులపై జంతువు దాడి చేయడంతో.. అది ఒంటరి తోడేలని భావించారు. వరుస ఘటనలతో ఓ తోడేళ్ల గుంపు చేపట్టే వేటగా గుర్తించారు. డ్రోన్లు, థర్మల్‌, ఇన్ఫ్రారెడ్‌ కెమెరాలతో తోడేళ్లు సంచరిస్తున్న ఏరియాలను గుర్తించి.. అక్కడ బోన్లను ఏర్పాటు చేశారు. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి బంధిస్తున్నారు. 12మంది జిల్లాస్థాయి అధికారులతో 16 బృందాలు మోహరించాయి. చివరి తోడేలును కూడా పట్టుకొనే వరకు అక్కడే ఉండేలా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అయితే ఎన్ని తోడేళ్లు ఉన్నాయో అంచనాకు రాలేకపోతున్నారు అధికారులు. మనుషులపై తోడేళ్ల దాడికి కారణమేంటో కూడా నిర్ధారణకు రాలేకపోతున్నారు అధికారులు. అడవిలో ఆహారం దొరకకపోవడం వల్లే తోడేళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయని కొందరు ఆఫీసర్లు చెబుతున్న మాట. గ్రామాలు కూడా అడవులకు దగ్గరగా ఉండటం మరో కారణమని చెప్తున్నారు.

జనంపై తోడేళ్ల దాడికి కారణమేంటి.?
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మనుషులు, తోడేళ్ల మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉందంటున్నారు వైల్డ్‌ లైఫ్‌ సైన్స్ ఎక్స్‌పర్ట్స్‌. తోడేళ్లు గుంపులుగా నివసిస్తాయని.. రెండు నుంచి పది జంతువులు ఒక గుంపుగా ఉంటాయని చెప్తున్నారు. సంతానోత్పత్తి కోసం అక్టోబర్‌ కంటే ముందు.. సురక్షితమైన స్థలం చూసుకుని పిల్లలను కంటాయని అంటున్నారు. తమ పిల్లలు పెద్దయ్యాక వేటాడటం నేర్పిస్తాయని..ఇది రెగ్యులర్‌గా జరిగే ప్రాసెస్‌ అని అంటున్నారు వైల్డ్‌ లైఫ్‌ సైన్స్ ఎక్స్‌పర్ట్స్‌. తోడేళ్లకు ఆహారం దొరకనప్పుడు మానవ నివాసాల మధ్య జీవించే వీధి కుక్కుల కోసం వెతుకుతాయి. ఆ సమయంలో మనుషులు కనిపిస్తే పొరపాటున దాడి చేస్తాయంటున్నారు. తర్వాత మనుషులపై దాడి చేయడాన్ని అలవాటు చేసుకుంటాయని అంటున్నారు. వాతావరణ మార్పు వల్లే ఇలా జరుగుతోందని చెప్తున్నారు వైల్డ్‌లైఫ్‌ సైన్స్ ఎక్స్‌పర్ట్స్‌. తోడేళ్లు ఈజీగా దొరికే ఫుడ్‌ కోసం వెతుకుతూ.. మనుషులపై అటాక్‌ చేసుస్తున్నాయోమోనని అంచనా వేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 489 తోడేళ్ల దాడులు..
2002 నుంచి 2020 వరకు ప్రపంచవ్యాప్తంగా 489 తోడేళ్ల దాడులు జరిగాయి, వాటిలో 78 శాతం రాబిస్ కారణంగానే దాడులు చేసినట్లు రీసెర్చ్‌లు చెప్తున్నాయి. హిమాలయాల దిగువ ప్రాంతంలో దాదాపు 1100 తోడేళ్లు ఉంటున్నట్లు అంచనా ఉంది. భారత్‌లో 4వేల నుంచి 6వేల తోడేళ్లు ఉన్నట్లు ఇంటర్నేషనల్ వుల్ఫ్ సెంటర్ రీసెర్చ్‌లో తెలిసింది. ఏనుగులు అయినా చిరుత పులులు అయినా.. ఇప్పుడు తోడేళ్లు.. అభయారణ్యమే వాటికి సేఫ్‌ జోన్. అవి దారి తప్పినా.. జనం వాటిని గెలికినా గ్రామాలపై పడుతాయి. మనుషులను ఖతం చేస్తాయి. వరుసగా జరుగుతోన్న ఘటనలు దీనికి ఉదాహారణగా కనిపిస్తున్నాయి.