GHMC: 27 మున్సిపాలిటీలు విలీనం.. భారీగా విస్తరించనున్న జీహెచ్ఎంసీ.. రూ.2కోట్ల నిధులు.. లిస్ట్ ఇదే..
అంతేకాకుండా రాష్ట్రంలో మరో కొత్త డిస్కం (మూడోది) ఏర్పాటునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
GHMC: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీని విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్ ను (ఔటర్ రింగ్ రోడ్) ఆనుకుని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలను (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా తెలంగాణ మునిసిపల్ యాక్ట్, జీహెచ్ఎంసీ యాక్ట్ ను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో మరో కొత్త డిస్కం (మూడోది) ఏర్పాటునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త డిస్కం పరిధిలోకి ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్స్ వస్తాయన్నారు.
ఇక, ప్రతి కార్పొరేటర్ డివిజన్ కు రూ.2 కోట్ల విడుదలకు కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అటు 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు GHMC లో కలిపుతూ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం జీహెచ్ఎంసీ కౌన్సిల్ ముందు పెట్టారు మేయర్. 2 కోట్ల వరకు పనులకు నిధులు మంజూరు చేయడం మంచి నిర్ణయం అని కార్పొరేటర్లు అన్నారు.
2007 వరకు MCH 173 చదరపు కిలోమీటర్లు ఉండేది. 2009కి ముందు 100 డివిజన్లు, 2009 తర్వాత 150 డివిజన్లు వచ్చాయి. 625 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ భారీగా విస్తరించనుంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తే 2వేల 200 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరణ జరిగే అవకాశం ఉంది. దీంతో GHMCలో డివిజన్లు భారీగా పెరగనున్నాయి.
జీహెచ్ఎంసీలో విలీనం అయ్యేవి ఇవే..
పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్. ఈ విలీనం ద్వారా జీహెచ్ఎంసీ పరిధి, జనాభా భారీగా విస్తరించనుంది.
ఇక రాష్ట్రంలో మూడో డిస్కం (విద్యుత్ పంపిణీ సంస్థ) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్‌పై ఉన్న రూ. 59,671 కోట్ల నష్టాల భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రస్తుత డిస్కంల పరిధిలో ఉండగా.. మిషన్ భగీరథ, మెట్రో వాటర్ బోర్డులకు సంబంధించిన విద్యుత్ సరఫరాను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు.
