Woman Kill : మణిపూర్ లో గన్ తో మహిళ కాల్చివేత
రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య గత రెండు నెలలుగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే ఆ మరునాడే ఒక స్కూల్ బయట మహిళను కాల్చి చంపడంతో ఆ ప్రాంతంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి.

Woman Kill (1)
Woman Shot Dead : మణిపూర్ లో అల్లర్లు తగ్గడం లేదు. హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనేవున్నాయి. తాజాగా మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్ వెలుపల ఓ మహిళను గన్ తో కాల్చి చంపారు. ఈ సంఘటన పశ్చిమ ఇంఫాల్ లో చోటు చేసుకుంది. గురువారం ఉదయం శిశు నిష్ఠా నికేతన్ పాఠశాల బయట ఉన్న మహిళపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
దీంతో ఆమె మృతి చెందారు. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య గత రెండు నెలలుగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే ఆ మరునాడే ఒక స్కూల్ బయట మహిళను కాల్చి చంపడంతో ఆ ప్రాంతంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి.
కాగా, కాంగ్ పోక్ పి జిల్లాలోని మాపావో, అవాంగ్ సెక్మై ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతా బలగాలు ఈ ఘర్షణను నివారించినట్లు పీటీఐ వెల్లడించింది. అలాగే తౌబాల్ జిల్లాలో మరో హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది.
పోలీసు ఆయుధ డిపో నుంచి తుపాకులు దోచుకునేందుకు అల్లరిమూకలు ప్రయత్నించగా ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్బీ) సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లరిమూకలు ఆ సిబ్బంది ఇంటికి నిప్పు పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.