Year Roundup 2025: ఘోర బస్సు, అగ్ని ప్రమాదాలు.. పెను విషాదం నింపిన 2025…
ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. మంటల్లో సజీవ దహనం అయ్యారు.
Year Roundup 2025: 2025 సంవత్సరం పెను విషాదాన్ని నింపింది. పలు ఘోర బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అనేక కుటుంబాల్లో అంతులేని విషాదం నింపాయి. అటు అగ్ని ప్రమాదాలు అనేకమందిని బలతీసుకున్నాయి. మంటల్లో సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదాలు అనేకమంది కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చాయి.
ఫిబ్రవరి 22న తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) ప్రాజెక్టు పరిధిలో సొరంగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది చనిపోయారు. దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ వద్ద 3 కిలోమీటర్ల మేర పై కప్పు కుప్పకూలింది. టన్నెల్ బోరింగ్ మిషన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్న క్రమంలోనే టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శ్రీశైలం ఎడమకాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ మైలురాయి వద్ద సుమారు 3 కిలోమీటర్ల మేర పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది గల్లంతవగా.. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.

అక్టోబర్ 25న కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు.

నవంబర్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 19 మంది మరణించారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది, బాధితుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. టిప్పర్ లో ఉన్న కంకరలో చాలా భాగం బస్సులో పడటంతో సగం బస్సు రాళ్లతో నిండిపోయింది. ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు.

రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్నిప్రమాదం..
నవంబర్ 26న హాంగ్ కాంగ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 160 మంది మరణించారు. వాంగ్ పుక్ కోర్టు కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ నివాస సముదాయంలో 2వేల ఇళ్లు ఉన్నాయి. మొత్తం 7 అపార్ట్‌మెంట్లలో 4వేల 800 మంది ప్రజలు నివసిస్తున్నారు. భవనాలు దగ్గర దగ్గరగా ఉండడంతో మంటలు ఇతర భవనాలకు వేగంగా వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు 128 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

డిసెంబర్ 6న ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించారు.ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నారు. కొందరు పర్యాటకులు కూడా ఉన్నారు. నైట్ క్లబ్ లో అంతా మంచి జోష్‌లో ఉన్నారు. ఆ ప్రాంగణమంతా ఈలలు-కేరింతలతో మార్మోగుతోంది. సడెన్ గా మంటలు చెలరేగాయి. అంతా బయటకు పరుగులు తీశారు.

డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో తులసిపాకల గ్రామానికి సమీపంలో అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు.

Bus Accident
