నాడు నారాయణ… నేడు బుగ్గన!

ఏపీలో రాజధాని విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. నాటి టీడీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో అనుసరించిన విధానాలనే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా ఫాలో అవుతున్నట్టుగా ఉందని జనాలు అనుకుంటున్నారు. మూడు రాజధానులు అంటూ జగన్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి మొదలైన అలజడి రోజు రోజుకూ పెరుగుతూ పోతోంది.
మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం, అందులో మూడు రాజధానుల ఏర్పాటుకే మొగ్గు చూపించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై హైపవర్ కమిటీ పేరుతో ప్రభుత్వం మరో కమిటీని నియమించింది. దీనికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.
మంత్రి బుగ్గన నేతృత్వంతోని హైపవర్ కమిటీలో 16 మంది సభ్యులున్నారు. మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని, సుచరిత, ఆదిమూలపు సురేష్ సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, సీసీఎల్‌ఏ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, లా సెక్రటరీలు అధికార యంత్రాంగం నుంచి సభ్యులుగా ఉంటారు. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అంత వరకూ బాగానే ఉంది. కాకపోతే ఈ కమిటీలో అందరూ మంత్రులే కావడంపై జనాలు రకరకాలుగా అనుకుంటున్నారు.
కమిటీలో ఉన్న సభ్యులంతా జగన్‌కు అనుకూలంగా ప్రకటనలు చేసే వారే తప్ప.. రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు లేరన్నది జనం అనుమానం. మంగళగిరి, తాడికొండ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవిలను కూడా సభ్యులుగా చేర్చి ఉండాల్సిందని అంటున్నారు. మంత్రులంతా జగన్ ఆలోచనకు భిన్నమైన అంశాలను ముందుకు తీసుకొచ్చే అవకాశం లేదంటున్నారు.
గతంలో టీడీపీ సర్కారు శివరామకృష్ణ కమిటీ నివేదికలు కాదని, అప్పటి మంత్రి నారాయణ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తమ అధినేత చంద్రబాబు అనుకున్న అంశాలకు అనుకూలంగానే నివేదిక అందజేసింది. ఈ కమిటీపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. శివరామకృష్ణ కమిటీ కంటే కూడా నారాయణ కమిటీ ఏమైనా గొప్పదా అంటూ ఆరోపణలు చేశారు. మరిప్పుడు బుగ్గనతో కమిటీలో ఉన్న మంత్రులంతా కూడా నిపుణులు, గొప్పవారా అని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
అధినేతల నిర్ణయాలతో నివేదికలు :
జగన్ నిర్ణయాలనే జీఎన్ రావు కమిటీ నివేదికలా అందించిందని, ఇప్పుడు జగన్‌తో పాటు జీఎన్ రావు కమిటీలోని విషయాలకు మద్దతుగానే బుగ్గన కమిటీ కూడా నివేదిక అందిస్తుంటే తప్ప అంతకు మించి ఏం జరగదని జనాలు అనుకుంటున్నారు. కమిటీల పేర్లు ఏవైనా.. అవి సీఎం నిర్ణయాలకు, అభిమతానికి అనుకూలంగానే వ్యవహరిస్తాయని చెబుతున్నారు.
అప్పట్లో నారాయణ కమిటీ అయినా.. బుగ్గన కమిటీ అయినా.. ఆ పార్టీల అధినేతల నిర్ణయాలకు మద్దతుగానే వ్యవహరిస్తాయని అంటున్నారు. ప్రస్తుత కమిటీలో రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై జనాలు పెదవి విరుస్తున్నారు. ఒక ప్రాంతంలో అనుకున్న రాజధానిని తరలించేటప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులను కమిటీలో సభ్యులుగా చేర్చకపోవడంతో ఇదంతా తూతూ మంత్రంగా నడిపించే వ్యవహారమని జనాలు అనుకుంటున్నారు.
ఇదే విషయం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మేకతోటి సుచరితను వేశామంటారు. కానీ మంత్రిగా ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు ఉండనే ఉండవని జనాలు అంటున్నారు. అప్పుడు నారాయణ కమిటీ వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించిన వైసీపీ ఇప్పుడు బుగ్గన కమిటీ వల్ల ప్రయోజనం ఏంటో చెబితే బాగుంటుంది కదా అని జనాలు డిస్కస్ చేసుకుంటున్నారు. అంతేనా.. కమిటీల పేర్లే వేరు గానీ.. అధినేతల ఆలోచనకు అనుగుణంగానే పని చేస్తాయని సెటైర్లు వేస్తున్నారు