ఏపీ బంద్ : డిపోల్లోనే బస్సులు

విజయవాడ : ప్రత్యేక హోదా కోరుతూ మరోసారి ఏపీ బంద్ జరుగుతోంది. కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడం లేదంటూ గతంలో కూడా బంద్‌లు కొనసాగిన సంగతి తెలిసిందే. తాజాగా హోదా సాధన సమితి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే…ఈ బంద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు దూరంగా ఉన్నాయి. టీడీపీ మాత్రం పరోక్షంగా బంద్‌కు మద్దతిచ్చింది.
బంద్ కు సంఘీభావంగా నల్లచొక్కాలతో టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరుకానున్నారు. విభజన చట్టంలోని అంశాలపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. రాజధానికి అరకొర నిధులతో పాటు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు తదితర అంశాలపైనా కేంద్ర నిర్లక్ష ధోరణిని ఎండకట్టనున్నారు. బ్లాక్ డే గా ప్రకటించటం తో పాటు ఫిబ్రవరి 13 తేదీ వరకు వరుస నిరసనలు తెలిపేలా కార్యాచరణ ప్రకటించనున్నారు. అసెంబ్లీ లో తీర్మానం తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళతారు. బిజెపియేతర పక్షాలతో సమావేశమవుతారు.
ఏపీఎస్ఆర్టీసీ బంద్‌లో పాల్గొంటామని ప్రకటించడంతో బస్సులు ఎక్కడికక్కడనే నిలిచిపోయాయి. దీనితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాలకు..ఇతర పనుల నిమిత్తం వెళ్లే వారు బస్సులు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజామునే వామపక్షాల నేతలు, ఇతర పార్టీల కార్యకర్తలు నిరసనలు చేపట్టాయి. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని..ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.