లక్ష్మీస్ ఎన్టీఆర్ : ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే

అమరావతి : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు విఘ్నాలు వీడలేదు. గత 2 రెండురోజులుగా ఏపీలో రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం నడుస్తోంది. ఈ సినిమా ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా గత నెలలోనే విడుదలైంది. కానీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సినిమా విడుదల కాలేదు. సినిమాను మే1 న విడుదల చేయటానికి ఆర్జీవీ ప్లాన్ చేసుకుని, రెండు రోజుల క్రితం విజయవాడలో ప్రెస్ మీట్ పెడదామనుకుంటే ఏపీ పోలీసులు ఆయన్ని అడ్డగించారు. ఆఖరికి ఆయన్ని ఎయిర్ పోర్టు దాటి బయటకు రానివ్వలేదు. ప్రెస్ మీట్ విషయమై ఆర్జీవీ చేసుకున్న అన్నిప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ పరిణామాల మధ్య ఆర్జీవీ ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదికి సినిమా విడుదల విషయమై లేఖ రాశారు. ఆర్జీవీ లేఖకు ద్వివేది మంగళవారం తన స్పందన తెలియచేశారు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా బయోపిక్ లపై నిషేధం విధిస్తూ ఏప్రిల్ 10 న ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. కనుక మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని , బయోపిక్ లపై నిషేధం కొనసాగుతుందని ద్వివేది స్పృష్టం చేసారు.