రూ.17వేల కోట్లు ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం జగన్ విన్నపం, ముగిసిన ఢిల్లీ పర్యటన

ఈ ప్రాజెక్ట్ వల్ల వెనుకబడ్డ రాయలసీమను ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం.

రూ.17వేల కోట్లు ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం జగన్ విన్నపం, ముగిసిన ఢిల్లీ పర్యటన

CM Jagan Delhi Tour

Updated On : February 9, 2024 / 8:22 PM IST

CM Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. పార్లమెంట్ లోని ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఢిల్లీలో పర్యటనలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు జగన్. రాష్ట్రానికి చెందిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ మొదటి విడత పూర్తికి దాదాపు 17వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరినట్లు తెలిసింది.

ఇక 2014 జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్ కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన 7వేల 230 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించే విధంగా చూడాలని సీఎం జగన్ కోరినట్లుగా సమాచారం. ఇక రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం జగన్ కోరినట్లుగా తెలిసింది. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని సీఎం జగన్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

Also Read : ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్..! ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవే..!

విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం-భీమిలి-రుషికొండ-విశాఖపట్నం పోర్టును కలిపే 55 కిలోమీటర్ల దూరం 6లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీని కోరారు సీఎం జగన్. ఇక విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం-కర్నూలు హైస్పీడ్ కారిడార్ ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని సీఎం జగన్ కోరారు.

కడప పులివెందుల ముదిగుబ్బ శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం హిందూపురం కొత్త రైల్వే లైన్ ను ఈ హైస్పీడ్ కారిడార్ లో భాగంగా చేపట్టాలని సీఎం జగన్ కోరినట్లుగా తెలిసింది. ఈ ప్రాజెక్ట్ వల్ల వెనుకబడ్డ రాయలసీమను ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం.

 

Also Read : లోక్‌సభ ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు.. జాతీయ సంస్థ సంచలన సర్వే