నవంబర్ 1న అవతరణ దినోత్సవం : శరవేగంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబరు ఒకటిన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జిల్లా స్థాయిల్లో జరిగే వేడుకల్లో మంత్రులు పాల్గొంటారని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా… రాష్ట్ర విభజన జరిగిన ఇన్నేళ్ళ తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 2014 జూన్ 2 న రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతుండగా..ఏపీ లో గందరగోళ పరిస్ధితి నెలకొంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆ రోజును ఏపీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణిస్తూ నవనిర్మాణ దీక్షలు చేపట్టేవారు.
1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
2013 వరకు ఏపీలో అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగేవి. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరపాలో తెలపాలని చంద్రబాబు అధికారంలో ఉన్న హయాంలో అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఒరిజనల్ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.
ఇక 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నవంబర్ 1 నే అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో నవంబర్ 1 శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు జగన్ ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.