ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు :  బొత్స 

  • Published By: chvmurthy ,Published On : January 30, 2020 / 12:35 PM IST
ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు :  బొత్స 

Updated On : January 30, 2020 / 12:35 PM IST

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్‌ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన వివిధ నగర పాలక సంస్థల అధికారులతో విజయనగరం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలకు అనుగుణంగా బాధ్యతగా పనిచేయాలన్నారు. సుపరిపాలన ఫలితాలు ప్రజలకు అందించేందుకు అధికారులు, సిబ్బంది మరింత కృషి చేయాలని చెప్పారు. 
 

అసంపూర్తిగా ఉన్న  ఇళ్ల నిర్మాణాలను టిడ్కో ద్వారా పూర్తిచేయాలన్నారు. కార్యదర్శుల పోస్టుల ఖాళీలను భర్తీచేయడంపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే నెల నుంచి లబ్ధిదారుల ఇళ్లకే వలంటీర్లు వెళ్లి పింఛను అందించాలన్నారు. కార్యదర్శులు, వలంటీర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలని మంత్రి ఆదేశించారు. 
 

మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ వచ్చేనెల 3వ తేదీనే ఓటర్ల జాబితాను ఆయా వార్డుల్లో బహిరంగపరచాలన్నారు. జాబితాల్లో ఏమైనా పొరపాట్లుంటే ఎలక్ట్రోలర్‌ రిటర్నింగ్‌ అధికారి అభ్యంతరాలను స్వీకరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ, మెప్మా పీడీ సుగుణాకరరావు, ఈఈ దిలీప్‌, ఎంహెచ్‌వో ప్రణీత, ఏసీపీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Also Read : మాస్క్ లేకపోతే కుదరదన్న సన్నీలియోన్ : కరోనా వైరస్ ఎఫెక్ట్