కార్మికులదే విజయం : ఫైనల్ అఫిడవిట్‌పై అశ్వత్థామ రెడ్డి స్పందన

  • Published By: madhu ,Published On : November 16, 2019 / 10:54 AM IST
కార్మికులదే విజయం : ఫైనల్ అఫిడవిట్‌పై అశ్వత్థామ రెడ్డి స్పందన

Updated On : November 16, 2019 / 10:54 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులదే విజయమన్నారు టీఎస్ ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. సోమవారం హైకోర్టులో సమ్మె అంశం తేలుతుందని, ప్రభుత్వానికి మొట్టికాయలు పడడం ఖాయమన్నారు. సమ్మెపై విచారణ జరుపుతున్న సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్నారు. సమ్మె అనేది లీగల్, 14 రోజుల ముందట నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్మాకు భయపడేది లేదని, కోర్టులో యాజమాన్యం ప్రూఫ్ చేసుకోలేదన్నారు.

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేయడంపై టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పందించారు. అన్నీ తప్పుడు లెక్కలు..ఎన్ని అఫిడవిట్లు దాఖలు చేస్తారు..ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు చెప్పారు. చర్చలు జరిపే ప్రసక్తే లేదని, సమ్మె చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ 2019, నవంబర్ 16వ తేదీ శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో నిరహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డితో మీడియా మాట్లాడింది. 

విలీనం డిమాండ్‌ను తాము తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్‌లో వచ్చేదానికి ఏం సంబంధం..సునీల్ శర్మ పర్మినెంట్ ఏమీ కాదన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఆడుతున్నారని, ఏమాత్రం సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని వెల్లడించారు. అఫిడవిట్ల విషయంలో కోర్టు స్పష్టంగా కొన్ని వ్యాఖ్యలు చేసిందని, అఫిడవిట్ వేయమని చెప్పామా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని..ఇలాంటి అఫిడవిట్లు దాఖలు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

ఆర్టీసీ నష్టాల్లో ఉన్నదనేది వాస్తవమని, కానీ దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు ట్యాక్స్ ద్వారా కొల్లగొడుతున్నారని, దీనిని మాఫీ చేయమని అడుగుతున్నామన్నారు. చర్చలు జరుగుతాయా ? లేదా ? అనేది కోర్టు చెబుతుందని, తీర్పు సారాంశాన్ని చదివిన తర్వాత స్పందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని, ఇక్కడ విజయం కార్మికులదేనన్నారు అశ్వత్థామరెడ్డి. 
Read More : ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం : హైకోర్టులో ఫైనల్ అఫిడవిట్ దాఖలు