దుబ్బాక టార్గెట్‌గా బీజేపీ సరికొత్త వ్యూహం, వర్కవుట్ అవుతుందా

మాది అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. మిగిలిన పార్టీల మాదిరిగా మా పార్టీ ఉండదంటూ కమలం నాయకులు చెబుతుంటారు. రానురాను బీజేపీలో ఆ క్రమశిక్షణ లోపించిందని నాయకులు తెలుసుకోలేకపోతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు అ అవకాశం వచ్చిందని ఆ పార్టీ భావిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలను ఆసరా చేసుకొని మెదక్ జిల్లాలో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఉప ఎన్నికల్లో సత్తా చూపించి జిల్లాలో జెండా ఎగురవేయాలని భావిస్తోంది.
దుబ్బాకలో ప్రభావం చూపగలిగితే పార్టీని నిలబెట్టుకోవడం సులువు అవుతుందని అంచనా:
మెదక్ జిల్లా అంటే టీఆర్‌ఎస్‌కు పట్టున్న జిల్లా. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఈ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దుబ్బాకలో ప్రభావం చూపగలిగితే పార్టీని నిలబెట్టుకోవడం సులువు అవుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని అంటున్నారు. జిల్లాలో నాయకుల మాటలు బాగానే ఉంటున్నాయి కానీ.. తమను కలుపుకొని పోవడం లేదని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారట. కరోనా నేపథ్యంలో కార్యక్రమాలేవీ లేవు కదా! ఇక కలుపుకొనిపోవడం లేదన్న విషయానికి అర్థమేముందని నాయకులు అంటున్నారు. కాదు కాదు అడపాదడపా చేస్తున్న కార్యక్రమాలకైనా ఒకరిద్దరితోనే మమ అన్పిస్తున్నారని కొందరి నాయకులు, కార్యకర్తల అభియోగం.
మెరుపు తీగలా వచ్చి వెళ్తున్న మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు:
ముఖ్యంగా జిల్లాల అధ్యక్షులు మొక్కబడిగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల ముందు కరోనా నేపథ్యంలో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని చేసిన ధర్నాల్లో కార్యకర్తలే కరువయ్యారు. ఇక ఇదే అంశంపై జిల్లా కలెక్టర్లను కలసి మెమోరాండం సమర్పించాలని పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపునకు ఏకంగా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీను గైర్హాజరవగా ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఆ కార్యక్రమాన్ని ఏదో ముగించేశాం అనిపించారు. ఆయన జిల్గా అధ్యక్షుడే అయినా హైదరాబాద్‌లోనే మకాం పెట్టారు. ఎప్పుడో తనకు బుద్ది పుట్టినప్పుడు అలా మెరుపు తీగలా వచ్చి పోతుంటారని కార్యకర్తలు అంటున్నారు.
కలుపుకునిపోయే నాయకత్వం లేకపోవడం బీజేపీకి నష్టం కలిగించే అంశమే:
సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా దూది శ్రీకాంత్ రెడ్డి ఇటీవల నియమితులయ్యారు. ఇక బీజేపీ దుబ్బాకలో తప్ప మరెక్కడా పెద్దగా కన్పించదు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి కూడా పటానుచెరుకే పరిమితమై పని చేస్తున్నారు. ఆయన స్థానంలో పార్టీలో మరో సీనియర్ నాయకునికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ ఎదుగుదల ఉంటుందని కొందరు నాయకుల మాటగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉత్తర భారతీయలు అనేక ప్రాంతాల్లో విరివిగా ఉన్నారు. వీరిలో ఎక్కవ శాతం మంది కమలం పార్టీ సానుభూతిపరులే ఉంటారు. వీరిని కలుపుకొనిపోయే నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి నష్టం కలిగించే అంశమే అంటున్నారు.
కేసీఆర్, హరీశ్‌రావులకు చాలెంజ్ విసరాలని బీజేపీ తహతహ:
ఉమ్మడి మెదక్ జిల్లాలో దుబ్బాక, పటాన్ చెరు నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ బలంగానే ఉంది. అందుకే దుబ్బాక నుంచి ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావును రంగంలోకి దించుతున్నారట. గత ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఓటింగ్ పర్సంటేజీని బాగానే పెంచుకోగలిగారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ సెంటిమెంట్‌తో పార్టీని బలోపేతం చేసుకోవాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఈ సీటును సొంతం చేసుకోవడం లేదా.. ఓటింగ్‌ను మరింతగా పెంచుకోవడం ద్వారా కేసీఆర్, హరీశ్‌రావులకు చాలెంజ్ విసరాలని బీజేపీ అనుకుంటోంది. మరి ఇందుకు తగ్గట్టుగా నాయకత్వం అందరినీ కలుపుకొని ముందుకు సాగితే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందని కార్యకర్తలు అంటున్నారు.