ఏపీ ప్రభుత్వంపై అధికారులు కుట్ర చేస్తున్నారు
విజయవాడ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై దాడికి కొత్త కుట్రకు తెర దీశారని సినీ హీరో శివాజీ ఆరోపించారు. దీనిలో కొందరు ఉన్నత స్ధాయి అధికారుల పాత్ర ఉందని ఆయన చెప్పారు. చుక్కల భూముల వ్యవహారంలో మంత్రులను సైతం అధికారులు లెక్కచేయటంలేదని ఆయన ఆరోపించారు.రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల చుక్కలు భూములు ఉన్నాయని వాటిని ఈస్టిండియా కంపెనీ రెగ్యులరైజ్ చేసిందని, ఆ ఫైల్ ని కొందరు అధికారులు తొక్కి పెట్టారని శివాజీ తెలిపారు.
కొందరు మాజీ అధికారులు చుక్కల భూముల రైతులను ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నారని, ప్రభుత్వంపై కేసులు వేయించేందుకు కూడా సిధ్దంగా ఉన్నట్లు శివాజీ చెప్పారు.చుక్కలు,చెరువులు భూముల పేరుతో ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ప్రభుత్వం పై వాళ్లకు వ్యతిరేకత ఉంటే రాజీనామా చేసి వెళ్లి వాళ్ళకు నచ్చిన పార్టీలో పని చేసుకోవచ్చని శివాజీ చెప్పారు. జగన్కు సీఎం కుర్చీ కావాలని ప్రజాసమస్యలు పట్టవని శివాజీ ఆరోపించారు. చుక్కల భూములపై ముఖ్యమంత్రి చెప్పినా అధికారులు పట్టించుకోవటం లేదని, సంక్రాంతిలోగా అధికారులు చుక్కల భూముల సమస్యను పరిష్కరించకపోతే ఆమరణదీక్ష చేస్తానని శివాజీ హెచ్చరించారు.