సీబీఐ కోర్టులో సీఎం జగన్ కు చుక్కెదురు

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 05:24 AM IST
సీబీఐ కోర్టులో సీఎం జగన్ కు చుక్కెదురు

Updated On : November 1, 2019 / 5:24 AM IST

నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురైంది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ ను కొట్టివేసింది. ఆస్తుల కేసులో విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై CBI ప్రత్యేక కోర్టు విచారించింది. శుక్రవారం(నవంబర్ 1,2019) తీర్పు ఇచ్చింది.

ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రతివారం విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాలేనని… తన బదులుగా తన లాయర్‌ హాజరవుతారని జగన్ ఈ పిటిషన్‌లో తెలిపారు. సీఎం హోదాలో హైదరాబాద్‌ వస్తే ప్రతిసారి రూ.60లక్షలు ఖర్చవుతుందని, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని కోర్టుకు విన్నవించారు. 

అయితే జగన్‌ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. జగన్‌పై తీవ్ర ఆర్థిక నేరాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయని.. ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారనే అరెస్టు చేశామని, ఇప్పుడు సీఎం హోదాలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. జగన్ పిటిషన్ ను తిరస్కరించింది.

వ్యక్తిగత హాజరు మినహాయింపుపై జగన్‌ గతంలో దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసిందని, హైకోర్టులో కూడా ఊరట దక్కలేదని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది. హోదాను కారణంగా చూపించి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరరాదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది.