జగనే అల్లర్లు సృష్టిస్తున్నారు : 120 సీట్లు ఖాయం

వైసీపీ చీఫ్ జగన్ పై ఏపీ హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నది జగనే అని ఆరోపించారు. అల్లర్లు సృష్టిచడమే కాకుండా శాంతి భద్రతలు లేవని అంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షమే సమస్యలు సృష్టిస్తూ శాంతిభద్రతలు సరిగా లేవని నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారన్న ఆయన.. ఈ హత్య ద్వారా ఎన్నికల్లో లబ్దిపొందాలని చూశారని .. ఆ ప్లాన్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. గుంటూరులో స్పీకర్ కోడెల మీద ఎలా దాడి చేశారో అంతా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు గెలవడం ఖాయమని .. చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా 115 నుంచి 120 సీట్లలో గెలుస్తామన్నారు.
ఏపీలో ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే అధికారులను బదిలీ చేసిందని చినరాజప్ప ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ బాగుందని జగన్ ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై నిందలు వేయడమే జగన్ పని అన్నారు. ఈవీఎంలలో సమస్యలు వచ్చినా టీడీపీ కోసం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేశారని రాజప్ప చెప్పారు. పోలింగ్ రోజు ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్నా ప్రజా సమస్యలపై సమీక్షలు చేయవచ్చని చినరాజప్ప సమర్థించుకున్నారు. ప్రభుత్వ కేర్ టేకర్ గా సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు. సమీక్షలు చేయకపోతే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. సీఎం సమీక్షలు చేయడాన్ని ఈసీ తప్పుపట్టింది. దీనిపై స్పందించిన చినరాజప్ప.. ఈసీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.