వైసీపీ అభ్యర్థి ఎవరు? తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై సీఎం జగన్ కీలక భేటీ

  • Published By: naveen ,Published On : November 19, 2020 / 04:00 PM IST
వైసీపీ అభ్యర్థి ఎవరు? తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై సీఎం జగన్ కీలక భేటీ

Updated On : November 19, 2020 / 4:15 PM IST

cm jagan tirupati loksabha by election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై సీఎం జగన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలు, సీనియర్ మంత్రులతో జగన్ సమావేశం అయ్యారు. తొలుత దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు. అయితే దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులు పోటీ చేసేందుకు విముఖత చూపారు. దీంతో కొత్త అభ్యర్థిని ప్రకటించాలని జగన్ నిర్ణయించారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో జగన్ చర్చిస్తున్నారు.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో తిరుపతి లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఖాళీగా ఉన్న తిరుపతి ఎంపీ సీటును ఎన్నికల సంఘం నోటిఫై చేసినప్పటికీ, ఇంకా బైపోల్ ప్రకటన రాలేదు. ఈలోపు పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో మునిగిపోగా.. టీడీపీ మాత్రం పేరును ఖరారు చేసి ఎన్నికలను రసవత్తరంగా మార్చింది. అందరికన్నా ముందుగా టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించింది.

బీజేపీకి చెక్ చెప్పిన చంద్రబాబు:
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. తిరుపతి సీటును ఈసీ నోటిఫై చేసినప్పటి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాల్లో పనబాకకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన తిరుపతిలో పాపులర్ నేతల్ని వెతుక్కోవడం బీజేపీకి కష్టంగా మారిందని, దాంతో మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నాయకురాలు పనబాక లక్షి వైపు కమలనాథులు మొగ్గుచూపుతున్నారని, ఆమెతో టీడీపీకి రాజీనామా చేయించి, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించేలా నేతలు మంత్రాంగం నడుపుతున్నారని జోరుగా వార్తలొచ్చాయి.

అందులో నిజానిజాలు ఎంతో ఎన్నికల నాటికి తేలతాయని భావించేలోపే.. చంద్రబాబు.. పనబాక పేరును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టగలిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, 2019 ఎన్నిక‌ల్లోనూ టీడీపీ త‌రపున పోటీ చేసి ఓట‌మి పొందారు ప‌న‌బాక ల‌క్ష్మి.

ముందుగానే అలర్ట్ అయిన చంద్రబాబు:
చంద్రబాబు అందరికంటే ముందుగా అప్రమత్తం అయ్యారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్న చంద్రబాబు తిరుపతి బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి చెందిన పార్టీ నేతలతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ఎన్నికలో టీడీపీ గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో తిరుపతి బైపోల్ అభ్యర్థిని కూడా ప్రకటించేశారు.

త్వరలోనే షెడ్యూల్:
ఇటీవల బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికలతోపాటే ఖాళీగా ఉన్న ఒక లోక్ సభ(వాల్మికి నగర్-బీహార్) సీటుకు, 11 రాష్ట్రాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వాటితో పాటే మరో 4 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నా, వివిధ కారణాలతో అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. గడువు ముంచుకొస్తుండటంతో కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాంలోని ఏడు అసెంబ్లీ సీట్లకు ఈసీ త్వరలోనే షెడ్యూల్ ప్రకటించనుంది. వీటితోపాటే ఖాళీ స్థానాలుగా నోటిఫై అయిన మూడు పార్లమెంట్ సీట్లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్రణాళికలు వేస్తోంది.

కర్ణాటకలో కేంద్ర మంత్రి సురేశ్ అంగడి మరణంతో ఖాళీ అయిన బెల్గాం, కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మరణంతో కన్యాకుమారి స్థానం, వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ ముగ్గురూ కరోనా కాటుకు బలైనవారే కావడం విచారకరం.