CM Revanth Reddy : బీఆర్ఎస్ ఖాతాలో 1500కోట్లు ఉన్నాయి.. రైతులకు ఓ 100కోట్లు సాయం చేయొచ్చు కదా- సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ పాపాలకే ఈ కరువు. కేసీఆర్ పాపాలు మా ఖాతాలో రాయడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుంది.

CM Revanth Reddy : బీఆర్ఎస్ ఖాతాలో 1500కోట్లు ఉన్నాయి.. రైతులకు ఓ 100కోట్లు సాయం చేయొచ్చు కదా- సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Counter To Kcr

CM Revanth Reddy : తెలంగాణ నుంచే కాంగ్రెస్ జాతీయ స్థాయి ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6న తుక్కుగూడ సభలో ఏఐసీసీ మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తామని.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభకు హాజరవుతారని సీఎం రేవంత్ వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. రాష్ట్రానికి జరిగే మేలును ఈ సభ ద్వారా తెలియజేస్తామన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఎన్నికల కోడ్ తర్వాత మిగతా హామీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ కంచుకోట అని నిరూపిస్తామన్నారు. సభలో మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్ల తర్వాత అయినా కేసీఆర్ పొలంబాట పట్టడం సంతోషం అన్నారాయన. అధికారం కోల్పోయినందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కేసీఆర్ పై జాలి కలుగుతుందన్నారు. కేసీఆర్ కు ఏ సీజన్ ఎప్పుడు వస్తుందో తెలియదా? అని విమర్శించారు.

”కేసీఆర్ పాపాలకే ఈ కరువు. కేసీఆర్ పాపాలు మా ఖాతాలో రాయడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుంది. 65 లక్షల మంది రైతుల ఖాతాలో మేము రైతుబంధు వేశాం. మిగిలింది 4 లక్షల మంది రైతులే. జనరేటర్ తో ప్రెస్ మీట్ పెట్టి విద్యుత్ పోయిందని మా ప్రభుత్వంపై నిందలు వేశారు. బీఆర్ఎస్ పదేళ్ళ ప్రభుత్వంలో మేము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు మేమే చేశాం. మేము తలుచుకుంటే మీరు బయటకు వెళ్లే వారా?

బీఆర్ఎస్ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. రైతులకు ఓ 100 కోట్లు సాయం చేయొచ్చు కదా? ఎన్నికల కోసమే కేసీఆర్ యాత్ర. కేసీఆర్ సూచనలు ఇస్తే.. న్యాయమైనవి అయితే అమలు చేస్తాం. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం. మేము ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి రాష్ట్ర హక్కులు సాధిస్తున్నాం. మీ కులం, కుటుంబం దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పారిపోతున్నారు. అందుకే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ చెల్లని వెయ్యి రూపాయల నోటు. జూన్ 9న ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుంది.

ఎన్నికల కోడ్ లో కొత్తవి అమలు చేయరాదు. పరిపాలన ఎన్నికల సంఘం చేతిలో ఉంది. మేము కూడా ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్ని పథకాలు అమలు చేయాలి. కాళేశ్వరంలో అన్నీ బొక్కలే. నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యం? మా ప్రాధాన్యత తాగు నీరు. పొదుపుగా నీరు వాడుతున్నాం. కాంగ్రెస్ కు 40 వస్తే అంటే.. మోడీకి 400 అని కేటీఆర్ ఒప్పుకున్నట్లేనా? బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే. చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కేసీఆర్ కు 48గంటల సమయం ఇస్తున్నా. వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : తెలంగాణ పాలిటిక్స్‌లో రేవంత్ దూకుడు.. కాంగ్రెస్‌ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్