తెలంగాణలో కరోనా పంజా : ఇండోనేషియా వాసులకు పాజిటివ్

  • Published By: madhu ,Published On : March 19, 2020 / 12:30 AM IST
తెలంగాణలో కరోనా పంజా  : ఇండోనేషియా వాసులకు పాజిటివ్

Updated On : March 19, 2020 / 12:30 AM IST

తెలంగాణ ప్రజలను కోవిడ్‌ వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి ఒకేసారి ఏడు కరోనా  కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.  వాస్తవానికి 2020, మార్చి 18వ తేదీ బుధవారం సాయంత్రం వరకు  కోవిడ్‌ -19 కేసులు ఆరు నమోదయ్యాయి. అయితే రాత్రి 10 గంటల సమయంలో కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా మరో ఏడు కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది.  దీంతో హైదరాబాద్ వాసులు  భయాందోళనకు గురవుతున్నారు.

బుధవారం 8 పాజిటివ్ కేసులు : –
కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియాకు చెందినవారే. ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో వారిని గాంధీకి తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. నిన్న ఉదయమే యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో బుధవారం ఒక్కరోజే తెలంగాణలో 8 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టయ్యింది.

సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష : – 
తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై 2020, మార్చి 19వ తేదీ గురువారం సీఎం కేసీఆర్‌ అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరుగనుంది.

వైరస్ కట్టడికి చర్యలు : –
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ చర్చించే అవకాశముంది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు హాజరవనున్నారు. పలువురు మంత్రులు, ప్రధాన శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : –
కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారికే వైరస్‌ సోకుతున్నందువల్ల వారికి సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించాలనీ ఆదేశించారు.  ప్రజలు స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జనం గుమిగూడే కార్యక్రమాలు, వేడుకలు రద్దు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు దూరంగా వుండాలని కోరారు. కరోనాపై ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.

Also Read | నా బిడ్డను నా భర్త పుట్టినప్పటి నుంచి ముట్టుకోలేదు: మనసులను కదిలిస్తున్న డాక్టర్ భార్య భావోద్వేగ ట్వీట్