హాస్టళ్ల మూసివేత..ఇప్పుడెలా..ఎక్కడికెళ్లాలె

కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్‌పైనా పడింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా… హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్ మూసివేయాలని GHMC కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమీర్‌పేట్,ఎస్‌ఆర్ నగర్, దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్, ఈసీఐఎల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోని హాస్టల్స్, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్‌లోని దాదాపు 850 హాస్టల్స్ మూతపడనున్నాయి. ఈనెల 31 వరకు వీటిని మూసివేయనున్నారు.
ఉన్నపళంగా హాస్టల్స్ మూసేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి హాస్టల్స్ మూసేస్తే ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్ మూసేయడంతో తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
GHMC ఆదేశాలతో 2020, మార్చి 17వ తేదీ మంగళవారం రాత్రికి రాత్రే పలు హాస్టల్స్‌ను మూసివేశారు. మరికొన్నింటిని అధికారులు దగ్గరుండి మూయించివేశారు. 2020, మార్చి 18వ తేదీ బుధవారం కూడా మిగిలిన హాస్టల్స్‌ను మూయించనున్నారు. హాస్టల్‌లోని విద్యార్థులు, కోచింగ్ తీసుకుంటున్న వారిని స్వస్థలాలకు పంపించాల్సిందిగా అధికారులు నిర్వాహకులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులను కాదని ఎవరైనా నిర్వాహకులు కోచింగ్ సెంటర్లు, వసతి గృహాలను నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భారతో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి మన దేశంలో 142 కేసులు నమోదయ్యాయి. మరోవైపు నిన్న మరో కరోనా మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ముంబయిలోని కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు వెల్లడించారు. దీంతో భారత్‌లో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే కరోనాతో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో ఒకరిది కర్నాటక కాగా.. మరొకరిది ఢిల్లీ.
Also Read | 5లక్షల రెస్టారెంట్లు మూసివేత