Kollu Ravindra : ఎన్నికలకు ముందు బందర్ పోర్టు డ్రామా షురూ, టీడీపీ ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తాం- కొల్లు రవీంద్ర
Kollu Ravindra : బందరు పోర్టు కాకుండా ఫిషింగ్ హార్బర్ లాగా చేయాలని చేస్తున్నారు. కేవలం నాలుగు బెర్త్ లు మాత్రమే నిర్మిస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి హడావుడిగా నిర్మిస్తున్నారు.

Kollu Ravindra (Photo : Google, Twitter)
Kollu Ravindra – Bandar Port : టీడీపీ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర.. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికలకు ముదు బందర్ పోర్టు డ్రామా మొదలెట్టారని విమర్శించారు. నాలుగు సంవత్సరాలు ఖాళీగా ఉండి.. ఎన్నికలకు 6 నెలల ముందు శంకుస్థాపన డ్రామా మొదలెట్టారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఈరోజు బందర్ లో జరిగిన ముఖ్యమంత్రి సభ పేర్ని నాని వీడ్కోలు సభలా ఉందని ఎద్దేవా చేశారు. పేర్ని నాని కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకే ఈ సభ నిర్వహించారని విమర్శించారు.
” పేర్ని నాని ఆధ్వర్యంలో మూడుసార్లు శంకుస్థాపన చేశారు. గతంలో పోర్టు నిర్మాణం పూర్తి చేయలేకపోతే మోకాళ్ల దండేసుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటానని నాని ప్రకటించారు. టీడీపీ హయాంలో పోర్టు నిర్మిస్తుంటే పేర్ని నాని 22 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టారు. నాలుగు సంవత్సరాలు ఖాళీగా ఉండి ఆరు నెలల ముందు శంకుస్థాపన డ్రామా మొదలెట్టారు. బందరు పోర్టు కాకుండా ఫిషింగ్ హార్బర్ లాగా చేయాలని చేస్తున్నారు. కేవలం నాలుగు బెర్త్ లు మాత్రమే నిర్మిస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి హడావుడిగా నిర్మిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే త్వరగా ఈ పోర్టును పూర్తి చేస్తాము” అని కొల్లు రవీంద్ర అన్నారు.
24 నెలల్లోనే పోర్టు నిర్మాణం పూర్తి, మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయి- సీఎం జగన్
సోమవారం బందర్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేశారు. అనంతరం మచిలీపట్నంలో బహిరంగ సభలో మాట్లాడారు. బందరుకు పోర్టు రాకుండా అడ్డుకున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. పోర్టు రాకూడదని వేల ఎకరాలను చంద్రబాబు తీసుకున్నారని, పోర్టు రాకపోతే అమరావతికి డిమాండ్ వస్తుందని భావించారని జగన్ చెప్పారు. పోర్టు నిర్మాణంలో ఎదురైన చిక్కుముళ్లు విప్పడానికి నాలుగేళ్ల సమయం పట్టిందన్నారు. పోర్టు నిర్మాణానికి ఉన్న గ్రహణాలన్నీ తొలగిపోయాయని, 24 నెలల్లోనే పోర్టు నిర్మాణం పూర్తవుతుందని, మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయని సీఎం జగన్ అన్నారు. పెద్ద పెద్ద ఓడలు బందర్ పోర్టుకి వస్తాయన్నారు.
Also Read..Karumuri Nageswara Rao : ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్- మంత్రి సంచలన వ్యాఖ్యలు