కారెక్కనున్న మాజీ మంత్రి  శ్రీధర్ బాబు 

  • Published By: chvmurthy ,Published On : March 3, 2020 / 12:29 AM IST
కారెక్కనున్న మాజీ మంత్రి  శ్రీధర్ బాబు 

Updated On : March 3, 2020 / 12:29 AM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలుంటే… ఒక్క మంథనిలో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీధర్‌బాబు ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నుంచి, రాజకీయంగా, అభివృద్ధిపరంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా ఏడాది కాలంగా మౌనంగా రాజకీయలను కొనసాగిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది టీఆర్ఎస్‌లో చేరిన సమయంలోనే శ్రీధర్‌బాబు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరిగినా అవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేశారు. కాంగ్రెస్ వాదిగానే రాజకీయల్లో కొనసాగుతానంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన కూడా పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం మళ్లీ మొదలైంది. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీధర్‌బాబు హవా ఓ రేంజ్‌లో ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. పార్టీ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండాలా? వద్దా? అనేది చాలా మంది నాయకుల్లో ఉన్న ప్రశ్న. ఇక మంథనిలో రాజకీయంగా శ్రీధర్ బాబుకు ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడం… అధికారులంతా టీఆర్ఎస్‌ నేతలకే సలామ్ కోడుతుండడం, ప్రజలు ఆశించిన తరహాలో తాను పని చేయలేకపోవడం లాంటి అంశాలు ఆయనను ఆవేదన కలిగిస్తున్నాయట. ఇక కాంగ్రెస్ పార్టీలో గెలిచిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరడంతో శ్రీధర్‌బాబు సైతం పార్టీ మారతారనే ప్రచారం మళ్లీ జరుగుతోంది. 

అధికార పార్టీ నేతల్లో కొంతమంది నేతలు శ్రీధర్‌బాబు పార్టీ మారతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో జరుగుతున్న ప్రచారంపై శ్రీధర్‌బాబు స్పందించక పోవడం ఇందుకు బలాన్నిస్తోందని అంటున్నారు. స్వతహాగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కోసం ఆయన తాపత్రయపడుతుంటారు. తన మాట చెల్లుబాటు కాని చోట ఉండడానికి ఇష్టపడని ఆయన…. టీఆర్ఎస్‌లో ఎలా ఇముడుతారనేది ఓ వర్గం నేతల వాదన. ఇంత ప్రచారం జరుగుతున్నా శ్రీధర్‌బాబు మాత్రం మౌనం వహిస్తుండడంతో దేనికి సంకేతమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరోపక్క, టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం శ్రీధర్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఓ పక్క సాగుతుండగా.. ఇలా పార్టీ మారతారనే వార్తలు కూడా రావడం వెనుక ఏదో ఉండే ఉంటుందని అంటున్నారు. అంటే ఆయనను పార్టీ నుంచి వెళ్లకుండా చేసేందుకు పీసీసీ ఇస్తారనే ఉద్దేశంతో ఆయన వర్గమే ఇలాంటి ప్రచారం చేస్తోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పీసీసీ చీఫ్‌గా శ్రీధర్‌బాబు పార్టీ బలోపేతానికి పాటుపడతారని అనుచరుల్లో ఓ వర్గం చెబుతున్నా, ఈనెల 7వ తేదీన మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరడం ఖరారైపోయిందని మరికొందరు అంటున్నారు. మరోపక్క, శ్రీధర్‌బాబుకు పీసీసీ పీఠం దక్కుండా చేసేందుకు కూడా ఇలాంటి ప్రచారం చేస్తున్నారనే వారు కూడా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందేనని జనాలు అంటున్నారు.