Jagadish Reddy Guntakandla : అందుకే కేసుల పేరుతో కాలం నెట్టుకొస్తున్నారు- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్

ఇదే పని మూడు నెలల కిందట చేస్తే ఒక్క ఎకరం ఎండేది కాదు. కేవలం కేసీఆర్ మీద కుట్రలతోనే రైతుల జీవితాలతో ఆటలాడారు.

Jagadish Reddy Guntakandla : అందుకే కేసుల పేరుతో కాలం నెట్టుకొస్తున్నారు- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్

Jagadish Reddy Guntakandla

Jagadish Reddy Guntakandla : నల్గొండ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ లో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. రోజూ కేసులు, ఫేక్ న్యూస్ లు, తిట్ల పురాణాలు తప్ప కాంగ్రెస్ కు ఇంకోటి లేదన్నారు. పొలాలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుంటే అవి పట్టడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన వాపోయారు. 200 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటివరకు ఏం తేల్చారో వాళ్లకే తెలియదన్నారు. రాజగోపాల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆయన ఎందుకు పిర్యాదు చేయరు? అని ప్రశ్నించారు.

”కాళేశ్వరం మీద ఇలానే రాశారు. ప్రజలకు ఇఛ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి డ్రామాలు మొదలుపెట్టారు. ప్రజల కోసం పోట్లాడే కేసీఆర్ ను ఏమీ చేయలేరు. రైతుల పొలాలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇది పట్టడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి మనమే ధైర్యం చెప్పేందుకు ముందుకు కదిలాం. స్వయంగా కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి రైతుల బాధలు విన్నారు. ఎండిన పొలాలకు 25వేల చొప్పున పరిహారం అడిగారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు కొత్తగా రుణాలు దొరకడం లేదు. రూ.500 బోనస్ కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ లాగు ఊడగొడతా అంటారు. ఇదేనా మీ సంస్కృతి?

వ్యాపారస్తుల జేబులు కొడుతున్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. రైతుల చెమట తాగి ఈ ప్రభుత్వం బతుకుతుంది. ఢిల్లీకి కప్పం కడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయట పడకుండా కేసుల పేరుతో కాలం నెట్టుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ మీద కుట్రలు చేస్తున్నారు. వాళ్లిద్దరూ కలిసి డమ్మీ అభ్యర్థులను పెట్టుకున్నారు. నీళ్లు ఇవ్వలేక కేఆర్ఎంబీ పై తప్పుడు మాటలు చెప్పారు. కేసీఆర్ పైన నెపం నెట్టాలని చూశారు.

కేసీఆర్ నల్లగొండ మీటింగ్ లో మాట్లాడితే భయపడిపోయారు. కేసీఆర్ బయటకు వస్తా అనగానే కాళేశ్వరం నీళ్లు ఇచ్చారు. ఇదే పని మూడు నెలల కిందట చేస్తే ఒక్క ఎకరం ఎండేది కాదు. కేవలం కేసీఆర్ మీద కుట్రలతోనే రైతుల జీవితాలతో ఆటలాడారు. రైతులను నష్ట పరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లోకి వెళ్ళాలి. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ప్రజలకు ఉపయోగం. అందరం కంకణం కట్టుకుని కేసీఆర్ ని నిలబెట్టుకుందాం. బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం” అని జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read : 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్