14 ఎంపీ సీట్లే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్

పార్లమెంటు సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ అంశం చర్చనీయాంశంగా మారుతుండడంతో.. పెండింగ్ లో ఉన్న మూడు సీట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు రేవంత్.

14 ఎంపీ సీట్లే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్

Cm Revanth Master Plan

CM Revanth Reddy Strategy : లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా దూకుడు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. 14 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న ఆయన.. అధిష్టానం ఆశీస్సులు కావాలని కోరుతున్నారట. ఇంతకీ సీఎం రేవంత్ ఏ అంశాలను అధిష్టానం ముందు పెట్టారు. పార్టీ అధిష్టానం నుంచి సీఎం రేవంత్ ఎలాంటి సహకారం కోరుతున్నారు?

సర్వే రిపోర్టుల్లో తేడాతో సీఎం రేవంత్ అలర్ట్..
పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక.. ప్రచారం వ్యూహం అంత బానే ఉన్నా.. సర్వే రిపోర్టులు మాత్రం కాస్త తేడా కొడుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో క్యాస్ట్ ఈక్వేషన్‌పై పార్టీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

మాదిగలకు సీట్లు దక్కకపోవడంపై అసంతృప్తి..
14 ఎంపీ సీట్లు సాధించాలంటే.. ఇంకా ప్రకటించబోయే మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు రేవంత్. హస్తిన పర్యటనలో అధిష్టానం దగ్గర కొన్ని అంశాలు ప్రస్తావించిన ఆయన.. సోషల్ ఇంజనీరింగ్ అంశాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయని వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన 14 సీట్లలో బీసీలకు కేవలం మూడు సీట్లు మాత్రమే కేటాయించడం, ఎస్సీ రిజర్వుడు సీట్లలో తెలంగాణలో అత్యధిక పాపులేషన్ ఉన్న మాదిగలకు సీట్లు దక్కకపోవడంపై ఆయా వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి.

కాంగ్రెస్ పై మందకృష్ణ మాదిగ ఫైర్..
మూడు ఎస్సీ రిజర్వ్ సీట్లలో రెండు మాల సామాజిక వర్గానికి, మరొకటి మాదిగ ఉపకులానికి దక్కడంతో.. సొంత పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు పిడమర్తి రవి వంటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ అయితే మాదిగలకు కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ తూర్పారబట్టారు. ఇక తక్కువ సీట్లు ఇచ్చారంటూ బీసీ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత వీహెచ్ తనకు ఖమ్మం నుంచి అవకాశం కల్పించాలని గట్టి పట్టు పడుతున్నారు.

ఆ స్థానాల్లో బీసీ అవకాశాన్ని పరిశీలించాలని విన్నపం..
పార్లమెంటు సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ అంశం చర్చనీయాంశంగా మారుతుండడంతో.. పెండింగ్ లో ఉన్న మూడు సీట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు రేవంత్. హైదరాబాద్ మినహా పెండింగ్ లో ఉన్న కరీంనగర్, ఖమ్మం సీట్లలో బీసీ అవకాశాన్ని పరిశీలించాలని కోరారట. ఇప్పటికే పార్టీ కూడా బీసీ కులగణన చేసి ఆ వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో.. రాజకీయంగా తగిన సీట్లు కేటాయించాలని సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటితే.. టార్గెట్ రీచ్ కాలేమంటూ అధిష్టానానికి వివరించారట రేవంత్.

Also Read : సై అంటే సై.. జహీరాబాద్‌ ఎంపీ సీటులో 3 పార్టీల మధ్య ఉత్కంఠ పోరు