కరోనా : తెలంగాణలో మరో నలుగురికి కరోనా…@ 45 కేసులు

తెలంగాణను కరోనా భయం వీడడం లేదు. లాక్ డౌన్ ప్రకటించినా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం మరో నలుగురికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కాకుండా..దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రయాణించిన వారికి ఈ వైరస్ సోకడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 45కి చేరినట్లైంది. వైరస్ సోకిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు ఎంతమందిని కలిశారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
కుత్బుల్లాపూర్ లో నివాసికి
కుత్బుల్లాపూర్ లో నివాసం ఉండే..ఓ వ్యక్తి మార్చి 14వ తేదీన సంపర్క్ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీకి వెళ్లాడు. అనంతరం మార్చి 17వ తేదీన తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో బయలు దేరి మార్చి 18వ తేదీన సికింద్రాబాద్ కు చేరుకుని ఇంటికి వెళ్లిపోయాడు. జ్వరం రావడంతో..మందులు వాడాడు. తక్కువ కాకపోయేసరికి గాంధీ ఆసుపత్రికి వచ్చి నమూనాలు ఇచ్చాడు. 2020, మార్చి 26వ తేదీ గురువారం వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.
ఆసుపత్రి వైద్యుడు..అతని భార్య
ఓ వైద్యుడు..అతని భార్యకు కరోనా వైరస్ సోకింది. మార్చి 17వ తేదీన విమానంలో తిరుపతికి వెళ్లాడు. అక్కడ NVIMS ఆసుపత్రిలో వైద్యుడిని కలిసి అదే రోజు హైదరాబాద్ కు వచ్చాడు. 18, 19వ తేదీల్లో ఇంటి వద్దనే ఉన్న ఇతను మార్చి 20వ తేదీన సోమాజీగూడలో ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వచ్చాడు. అస్వస్థతగా ఉండడంతో ఇంటికి వెళ్లిపోయాడు. మార్చి 21వ తేదీన కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి.
మార్చి 24వ తేదీన భార్యతో కలిసి గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. ఇద్దరికీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వీరికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. వీరి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు చేశారు. వీరి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం వైద్యుడు, అతని భార్యను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సికింద్రాబాద్ బుద్ధ నగర్ వాసికి
కరోనా వైరస్ సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్న వ్యక్తికి సోకిందనే వార్త తీవ్ర కలకలం రేగింది. బుద్ధ నగర్ ఉంటున్న వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతడిని ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read | రోడ్డుపైకి వచ్చి మమత ఏం చేసిందో చూడండి