బ్రేకింగ్ : జగన్ ఓటు తొలగించాలని దరఖాస్తు

ఏపీలో ఓట్ల అక్రమ తొలగింపు వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఓటర్లకు తెలియకుండానే ఓటు తొలగించాలని ఆన్ లైన్ లో ఫామ్ 7 అప్లికేషన్లు లక్షల సంఖ్యలో

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 03:43 PM IST
బ్రేకింగ్ : జగన్ ఓటు తొలగించాలని దరఖాస్తు

Updated On : March 12, 2019 / 3:43 PM IST

ఏపీలో ఓట్ల అక్రమ తొలగింపు వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఓటర్లకు తెలియకుండానే ఓటు తొలగించాలని ఆన్ లైన్ లో ఫామ్ 7 అప్లికేషన్లు లక్షల సంఖ్యలో

ఏపీలో ఓట్ల అక్రమ తొలగింపు వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఓటర్లకు తెలియకుండానే ఓటు తొలగించాలని ఆన్ లైన్ లో ఫారం 7 అప్లికేషన్లు లక్షల సంఖ్యలో వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లకు తెలియకుండా వారి ఓటు తొలగించేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఓటు తొలగించాలని దరఖాస్తు వచ్చింది. కడప జిల్లా పులివెందులలో జగన్ ఓటు తొలగించాలని జగన్ పేరు మీద ఆన్ లైన్ లో ఫారం 7 దరఖాస్తు వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి హరికిరణ్ ధృవీకరించారు.

పులివెందుల జగన్ సొంత నియోజకవర్గం. జగన్ ఓటు తొలగించాలని కోరుతూ ఆన్ లైన్ లో ఫారమ్ 7 దరఖాస్తు వచ్చిందని తహసిల్దార్ గుర్తించారు. ఇది చూసి ఆయన విస్మయానికి గురయ్యారు. వెంటనే విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని నోటీసుల ద్వారా జగన్ కు తెలియజేస్తామని ఎన్నికల అధికారి చెప్పారు. జగనే స్వయంగా దరఖాస్తు చేశారా లేక ఎవరైనా తప్పుడు పేరుతో దరఖాస్తు చేశారా అనే వివరాలు తెలుసుకుంటామన్నారు. ఓటు తొలగించాలని తానే ఫారం 7 దరఖాస్తు చేసినట్టు జగన్ చెబితే.. పరిశీలించి ఓటు తొలగించే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ తాను దరఖాస్తు చేయలేదని జగన్ చెబితే.. ఆయన ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి చెప్పారు.

ఏపీలో ఓట్ల తొలగింపు, ఫారం-7 వ్యవహారాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల నాయకులు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారని ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

ఓటర్ల జాబితా నుంచి తమ పేరు తొలగించాలంటూ ఓటర్లకు తెలియకుండానే వారి పేరిట ఎన్నికల సంఘానికి కొందరు భారీ ఎత్తున దరఖాస్తులు పెడుతున్నారు. రోజుల వ్యవధిలో ఎన్నికల సంఘానికి ఫారం-7లు లక్షల్లో వెల్లువెత్తాయి. గుంటూరు జిల్లాలో 1.17 లక్షలు, చిత్తూరులో 1.09 లక్షల మంది పేరిట ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.

ఓటర్ గా నమోదు కావాలంటే ఫారం-6 అప్లయ్ చేయాలి. జాబితా నుంచి పేరు తొలగించాలన్నా, ఎవరి పేరైనా ఓటర్ల జాబితాలో ఉండటంపై అభ్యంతరం తెలపాలన్నా ఫారం-7తో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్‌ ఓటర్‌ సర్వీసు పోర్టల్‌ లో ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లో ఈ దరఖాస్తులు చేసుకునేలా ఎన్నికల సంఘం ప్రజలకు వెసులుబాటు కల్పించింది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫారాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సదవకాశాన్ని కొన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు, కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు.