గాల్లో కలిసిన విలీనం డిమాండ్ : ఆర్టీసీ కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా

  • Published By: madhu ,Published On : November 21, 2019 / 04:48 AM IST
గాల్లో కలిసిన విలీనం డిమాండ్ : ఆర్టీసీ కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా

Updated On : November 21, 2019 / 4:48 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా ? తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు సమ్మతిస్తుందా ? ఆర్టీసీ యూనియన్లు తీసుకున్న నిర్ణయంతో బంతి ఇప్పుడు ప్రభుత్వం కోర్టులో పడింది. దీంతో ప్రభుత్వం ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న అంశం అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అధికారులతో మరోసారి సమావేశమై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సమ్మె విషయానికి వస్తే…ఇందులో ప్రభుత్వానిదే పైచేయిగా నిలిచింది. కార్మికుల ప్రధాన డిమాండ్ గాల్లో కలిసిపోయింది. అదే ఆర్టీసీ విలీనం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధానమైన డిమాండ్ తోనే సమ్మెకు దిగారు కార్మికులు. కానీ కేసీఆర్ సర్కార్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించింది. ఎన్ని ధర్నాలు చేసినా, సమ్మెలు చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో కార్మికులే వెనక్కి తగ్గారు. హైకోర్టు కూడా చేతులెత్తేయడం, విషయం లేబర్ కోర్టుకు రావడం, కార్మికుల ఆర్థిక కష్టాలు రెట్టింపు కావడంతో యూనియన్లు వెనక్కి తగ్గాయి. అందుకే సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం నుంచి హామీ తీసుకున్న తర్వాతే సమ్మెను విరమించాలని నిర్ణయించుకున్నారు. 

సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ ఓ కండీషన్ పెట్టింది. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుంటేనే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అన్నారు. సమ్మెకు ముందున్న పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను లేబర్ కోర్టుకు ప్రభుత్వం సత్వరమే నివేదించాలన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఓ ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. 
Read More : ఆరోగ్యం కోసం : స్కూల్లో వాటర్ బెల్