కీలక పరిణామం.. బీజేపీ అధిష్టానం నుంచి పవన్ కల్యాణ్‌కు పిలుపు

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

కీలక పరిణామం.. బీజేపీ అధిష్టానం నుంచి పవన్ కల్యాణ్‌కు పిలుపు

Pawan Kalyan

Updated On : February 21, 2024 / 4:12 PM IST

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి సడెన్ గా పిలుపు రావడంతో పవన్ కల్యాణ్ తన భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నారు. ఉన్న పళంగా హస్తినకు పయనం కానున్నారు.

రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళనున్నారు పవన్. ఢిల్లీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. చాలాకాలంగా బీజేపీ పెద్దల పిలుపు కోసం వేచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు చంద్రబాబు కూడా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి భేటీ అనంతరం.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్యలపై ఢిల్లీ పెద్దలతో పవన్ చర్చిస్తారని జనసేన వర్గాలు అంటున్నాయి.

Also Read : పైకి పొత్తులు.. లోపల కత్తులు..? టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం అదేనా?

భీమవరం నుంచి రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. బీజేపీ ముఖ్య నాయకులు అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన చంద్రబాబు.. అమిత్ షా ను కలిసి వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ పెద్దల నుంచి తనకు కబురు వస్తుందని పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో వేచి చూశారు. కానీ, సమాచారం రాలేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఏ క్షణమైనా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని ఆశించారు. కానీ, అటు వైపు నుంచి స్పందన లేకపోవడంతో పవన్ కల్యాణ్ నియోజకవర్గాలు, జిల్లాల రివ్యూల కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఇంతలో జనసేనానికి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హస్తిన బాట పట్టారు. పవన్ కల్యాణ్ … రేపు ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని టీడీపీ ఎంపీలను రెడీగా ఉండాలని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల వ్యవహారంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 7న అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు చర్చించారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఢిల్లీ పెద్దలతో మాట్లాడాలని అనుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత మాట్లాడుకుందాం అని బీజేపీ పెద్దలు చెప్పారు.