టీడీపీ గూటికి వైసీపీ కీలకనేత సునీల్.. కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ!

  • Published By: vamsi ,Published On : March 1, 2019 / 09:16 AM IST
టీడీపీ గూటికి వైసీపీ కీలకనేత సునీల్.. కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ!

Updated On : March 1, 2019 / 9:16 AM IST

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారే నేతలు ఎక్కువయ్యారు. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష వైసీపీలోకి వెళ్లగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న నేత చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం గూటికి చేరారు. ఇవాళ ఉదయం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న చలమలశెట్టి సునీల్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. సునీల్‌తో పాటూ పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ మాజీ కో-ఆర్డినేటర్లు తోట సుబ్బారావు నాయుడు, ముత్యాల శ్రీనివాస్, కాకినాడ కార్పొరేషన్ కార్పొరేటర్లు కంపర రమేష్, పలకా సూర్యకుమారి సునీల్ తో పాటు టీడీపీలో చేరారు. 

ఈ సంధర్భంగా మాట్లాడిన సునీల్ తెలుగుదేశంలో చేరడం ఆనందంగా ఉందని, తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు సునీల్.

మరోవైపు సునీల్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఆయను టికెట్ దాదాపుగా ఖాయమయ్యిందనే ప్రచారం కూడా జరుగుతోంది. కాకినాడ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన తోట నర్సింహం.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో సునీల్ వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. చలమలశెట్టి సునీల్ తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.