జగన్ ను టార్గెట్ చేయబోయి.. చంద్రబాబుని ఇరుకున పడేశారా..?
నానీలందు కేశినేని నాని వేరయా.. ఏదేమైనా గానీ.. ఎవరైనా ఏదైనా అనుకోనీ.. ఈ నాని తీరే వేరు. తాను అనుకొని, అకౌంట్లో ట్వీట్లు పెట్టుకొని, దాంతో సొంత పార్టీ ఇరకాటంలో

నానీలందు కేశినేని నాని వేరయా.. ఏదేమైనా గానీ.. ఎవరైనా ఏదైనా అనుకోనీ.. ఈ నాని తీరే వేరు. తాను అనుకొని, అకౌంట్లో ట్వీట్లు పెట్టుకొని, దాంతో సొంత పార్టీ ఇరకాటంలో
నానీలందు కేశినేని నాని వేరయా.. ఏదేమైనా గానీ.. ఎవరైనా ఏదైనా అనుకోనీ.. ఈ నాని తీరే వేరు. తాను అనుకొని, అకౌంట్లో ట్వీట్లు పెట్టుకొని, దాంతో సొంత పార్టీ ఇరకాటంలో పడనీ.. అయినా నాని వెనకడుగు వేయడని చెప్పాలని ఉంది కానీ.. నా.. నీ.. అన్నదే ఎరుగని నాని.. ఎవరి మాట వింటాడని? నాడు అధినేత మాటనే వినని నాని.. తన ట్వీట్లతో వైసీపీకి అస్త్రాలు అందిస్తున్నాడని ఎంతమంది మొత్తుకున్నా కానీ.. తన తీరు మార్చుకోడని అనుకోవడమే మన పని.
సొంత పార్టీనే ఇరకాటంలో పెడుతున్న నాని ట్వీట్లు:
విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ట్వీట్లతో కాక పుట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాను అనుకున్నది ఏమాత్రం సంకోచించకుండా ట్వీటేస్తున్నారు. ఈ ట్వీట్లు సొంత పార్టీలోనూ సెగలు పుట్టిస్తున్నాయి. తాజాగా నాని చేసిన ఓ ట్వీట్ మళ్లీ దుమారం రేపుతోంది. తన సొంత పార్టీ తెలుగుదేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ ఆ పార్టీనే ఇరకాటంలో పెట్టిందంటున్నారు. నిజానికి నాని ఉద్దేశం వేరు అయినప్పటికీ ఇప్పుడు సొంత పార్టీ మెడకే అది చుట్టుకుందంట.
వైసీపీ విజయానికి ఆయనే కారణం:
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసి.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే కారణంతో ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గతంలో ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం కొన్నాళ్లపాటు వెయిటింగ్ లిస్టులో ఉంచింది. తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయమై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. మీరు సీఎం కావడానికి, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ అని నాని ట్వీట్ చేశారు.
అసలు నాని ఉద్దేశ్యం ఏమిటి..?
నాని చేసిన ట్వీట్ వెనుక వేరే ఉద్దేశాలున్నాయని అంటున్నారు. చంద్రబాబుకు తప్పుడు సలహాలు, సమాచారాన్ని ఇవ్వడం ద్వారా వెంకటేశ్వరరావు టీడీపీ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారన్నది నాని ఉద్దేశమట. కానీ, నాని ట్వీట్ వల్ల వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా పని చేసినట్టు తేలిపోయిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన వెంకటేశ్వరరావుతోపాటు కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. దీంతో ఈ ముగ్గుర్ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
టీడీపీని ఇరకాటంలో పెడుతున్న వైసీపీ:
ఏబీ వెంకటేశ్వరరావుకు ఎన్నికల విధులతో సంబంధం లేదనే కారణంతో ఏపీ సర్కారు ఆయన బదిలీని ఆపేసింది. బదిలీల వ్యవహారంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కానీ, ఎన్నికల సంఘం వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పడంతో.. ఆయన్ను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఆయనను జగన్ సర్కారు సస్పెండ్ చేయడంతో నాని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం దీనికి వేరే అర్థాలు తీస్తుండడంతో టీడీపీ ఇరకాటంలో పడుతోంది. టీడీపీ హయాంలో ఆయన చేసిన అక్రమాలు నిజమేనని పరోక్షంగా అంగీకరించేలా నాని ట్వీట్ ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.
చంద్రబాబుకి తలనొప్పిగా మారిన ఏబీ ట్వీట్:
నాని ట్వీట్‌కు స్పందనగా వెంకటేశ్వరరావు చేసిన ట్వీట్‌ను వైసీపీ పట్టుకుంది. ఏమిటోనండీ ఎంపీ గారూ.. మీరేమో ఇలా అంటారు.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారని వెంకటేశ్వరరావు ట్వీట్ చేయడం ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారిందంట. గతంలో కూడా కేశినేని నాని చేసిన ట్వీట్లు పార్టీని ఇరకాటంలో పడేశాయి. బుద్ధా వెంకన్న గురించి, దేవినేని ఉమ గురించి ఆయన చేసిన ట్వీట్లు చర్చనీయాంశాలయ్యాయి. అలాగే అప్పట్లో గల్లా జయదేవ్ ను పార్లమెంటరీ పార్టీ నేతను చేసినప్పుడు కూడా చంద్రబాబుపై నాని అలకబూనారు. కొన్ని ట్వీట్లు కూడా చేశారు. స్వయంగా చంద్రబాబు తనను కలుసుకోవాలని నానికి కబురు పంపించినా రాలేదు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఇలా తాను అనుకున్నది నాని ట్వీట్లు చేయడంతో వైసీపీ సంగతేమో కానీ సొంత పార్టీనే ఇబ్బందుల్లో పడేస్తున్నాయని జనాలు అనుకుంటున్నారు.