గులాబీ గుబాళించాలి : ఢిల్లీ మెడలను ప్రజలు వంచాలి – కేటీఆర్

ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చొవాలో టీఆర్ఎస్ నిర్ణయించే స్థాయికి ఎదగాలని…లోక్ సభ ఎన్నికల్లో ఎంఐఎం ఒక్క సీటు కలుపుకుని మొత్తం 17 ఎంపీ స్థానాలను గెలిపిస్తేనే అది సాధ్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగా జిల్లాల వారీగా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల్లో జరిగే సభలకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై నేతలు, కార్యకర్తలకు దిశా..నిర్దేశం చేస్తున్నారు. మార్చి 07వ తేదీ గురువారం వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఐదు లక్షల ఓట్లతో ఎంపీని గెలిపించి వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
సంక్షేమ పథకాలు కాపీ :
గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు, పథకాలు అందరి దృష్టిని ఆకర్షించాయన్నారు. రైతుల విషయంలో సీఎం కేసీఆర్‌కి సంపూర్ణమైన అవగాహన ఉండబట్టే వారి కోసం సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు. రైతు బందు కాపీ కొట్టిన ఏపీ సీఎం బాబు అన్నదాత సుఖీభవ పేరిట రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని గుర్తు చేశారు. భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం పీఎం కిసాన్ పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు.
ప్రొ.జయశంకర్ సూచనలు..సలహాలు :
కేసీఆర్‌కు ఇష్టమైన జిల్లా వరంగల్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొ.జయశంకర్ సలహాలు..సూచనలతో కేసీఆర్ ముందుకెళ్లారని సభలో కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు, రాష్ట్రానికి ఏ నాటికైనా స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని జయశంకర్ తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. రాజీలేని పోరాటం చేసే నాయకుడు కేసీఆర్ అని.., ఢిల్లీలో రాజకీయ వ్యవస్థను శాసించి సాధించుకోవాలే కానీ యాచించి కాదన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకోవాలని చెప్పారని, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు.
17 ఎంపీలను గెలిపించుకోవాలి :
కేసీఆర్ పరిపాలనను రాజకీయ ప్రత్యర్థులు కూడా మెచ్చుకుంటారని ఆయన అన్నారు. పరకాల నియోజకవర్గంలో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాకు రూ.
300 కోట్లు కేటాయించారని తెలిపారు. రైల్వే వ్యాగన్ పరిశ్రమ కోసం ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. సంవత్సరకాలంలో వరంగల్ జిల్లాల పచ్చగా మారుతుందన్నారు. మోడీ, రాహుల్ గాంధీ కంటే మేలైన, అద్బుతమైన నాయకులు, పార్టీలున్నాయన్నారు. ఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలో, ప్రధాన మంత్రి ఎవరు కావాలో టీఆర్ఎస్ నిర్ణయించే స్థాయికి ఎదగాలని, ఇందుకు ఎంఐఎం సీటుతో సహా 16 ఎంపీలను గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.